ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్‌రావే కీలకం.. బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్

ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్‌రావే కీలకం.. బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్‌రావే కీలకమని కౌంటర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీని నెలకొల్పింది ఇతనేనని, ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఇది పనిచేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. 

ఫోన్‌ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా SOT విధులు నిర్వహించిందని, ట్యాపింగ్‌ బాధితుల్లో ప్రతిపక్షాలను, కొందరు అధికారులను, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారని పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) తన వాదనలు వినిపించారు. ఓఎస్‌డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు చేసిన ప్రభాకర్ రావు ఐపీఎస్‌ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో విధిలేక ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడని, హైదరాబాద్‌ వస్తున్నానని గతంలో ట్రయల్‌ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారని, దాదాపు తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకూ ఇండియాకు రాలేదని పీపీ గుర్తుచేశారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్‌ దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ కేసులో విచారణను కోర్టు ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.