సుల్తానాబాద్‌లో కాపర్ వైర్ చోరీ ముఠా అరెస్ట్

సుల్తానాబాద్‌లో కాపర్ వైర్ చోరీ ముఠా అరెస్ట్
  • రూ.2.50 లక్షల సొత్తు స్వాధీనం
  • పరారీలో ఇద్దరు ప్రధాన నిందితులు 

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ టౌన్ శాస్త్రి నగర్ లోని ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్ లో కాపర్ వైర్ చోరీ ముఠా కేసును పోలీసులు ఛేదించారు. సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 24న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు  ట్రాన్స్ ఫార్మర్ సెంటర్ వెనక వైపు కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోపలకు వెళ్లి  300 కేజీల కాపర్ వైర్ ను ఎత్తుకెళ్లారు. షాపు ఓనర్ జి. నరేందర్ రెడ్డి ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 గురువారం తెల్లవారుజామున మరోసారి దొంగలు అదే సెంటర్లో చోరీకి యత్నిస్తూ పోలీసులకు దొరికారు.  మంచిర్యాల జిల్లాకు చెందిన పిట్టల సురేందర్, సిలివేరు శంకరయ్య, గోశిక కార్తీక్, కడమండ శ్రీకాంత్ తో పాటు కాపర్ వైర్ ను కొనుగోలు చేసిన బెల్లంపల్లికి చెందిన పసుపులేటి శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు గుర్రాల చిన్న భూమయ్య, హైదరాబాద్ కు చెందిన రాము పరారీలో ఉన్నట్టు ఏసీపీ తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద రూ.2.50 లక్షల విలువైన కాపర్ వైర్ ను, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులను అందజేశారు.