శంషాబాద్, వెలుగు: శంషాబాద్ లో నిబంధనలు పాటించని లాడ్జిలపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఆర్జీఐఏ సీఐ బాలరాజు, రూరల్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి బుధవారం తనిఖీలు చేశారు. తొలుత మధురనగర్ లోని కీర్తి, భారతి, ఓకే లాడ్జిలపై దాడి చేశారు. ఎలాంటి అనుమతులు,ఫైర్ సేఫ్టీ, జిస్టర్ ఎంట్రీ సక్రమంగా లేకపోవడంతో నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
అనంతరం నంబర్ ప్లేట్లు, లైసెన్స్ లేకుండా నడుపుతున్న వాహనాలను స్వాధీనం చేసుకొని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. పాన్ షాపుల్లో గుట్కాలను అమ్ముతున్న6 మందిని పట్టుకొని, రూ. 30 వేల సరుకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేసి, బీర్, లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు.
రెండు ఫంక్షన్ హాళ్లపై కేసు
చేవెళ్ల: శంకరపల్లి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మొయిన్, మణి గార్డెన్ ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10 దాటిన తర్వాత కూడా డీజేలు పెట్టడంతో చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్తెలిపారు.