- పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు
- వివిధ శాఖల అధికారులతో స్పెషల్ టీమ్‌లు
- చైల్డ్ లేబర్‌ను గుర్తించిన హాట్‌స్పాట్స్‌పై నిఘా
- తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లల అప్పగింత
మంచిర్యాల, వెలుగు: ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో దురదృష్టవశాత్తు చాలామంది బాలబాలికలు కార్మికులుగా మారుతున్నారు. పేదరికం కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనంలోనే చదువు మాన్పించి పనుల్లో పెడుతున్నారు. ఏ ఆదరణకు నోచుకోని కొంతమంది అనాథలు బుక్కెడు బువ్వ కోసం పసిప్రాయంలోనే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.
మరికొందరు ఇండ్ల నుంచి పారిపోయి, తప్పిపోయి విధివంచితులుగా మారుతున్నారు. కారణాలేమైనా మరపురాని వారి బాల్యం పని స్థలాల్లో నలిగిపోతోంది. ఫలితంగా వారి బంగారు భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ఇలాంటి వారికి విముక్తి లభించనుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ఈ నెల 1న ప్రారంభమైంది. వివిధ శాఖల సమన్వయంతో ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. హోటళ్లు, షాపులు, మెకానిక్ షెడ్లు, ఇతర ప్రదేశాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను ఈ స్పెషల్ టీమ్‌లు గుర్తించనున్నాయి.
వివిధ శాఖల సమన్వయంతో..
పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్మెంట్ల అధికారులు, సిబ్బందితో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ సబ్ డివిజన్ల వారీగా ప్రోగ్రాం ఇన్చార్జిలుగా ఎస్సై స్థాయి అధికారులను నియమించారు. వీరు తమ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, షాపులు, పండ్ల దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీలు, ఇతర ప్రదేశాల్లో తిరుగుతూ బాలకార్మికులను గుర్తిస్తారు. వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఫైన్లు విధిస్తారు. ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనర్‌ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో ఆపరేషన్ ముస్కాన్ విధివిధానాలపై సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
హాట్‌స్పాట్స్‌పై నిఘా..
నెల రోజుల పాటు చేపట్టే ఆపరేషన్ ముస్కాన్ ప్రోగ్రాంలో బాలకార్మికులను గుర్తించడంతో గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగా పిల్లలు పనిచేస్తున్న హాట్ స్పాట్స్‌పై నిఘా పెడతారు. గతంలో రెస్క్యూ చేసిన పిల్లల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటారు. డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి వారిని తిరిగి స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తారు. ఆరోగ్యం బాగాలేని వారిని హాస్పిటళ్లలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తారు. షాపుల వద్ద ‘మా వద్ద బాలకార్మికులు లేరు’ అనే బోర్డులను ఏర్పాటు చేయిస్తారు.
బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే దుష్పలితాలపై అవగాహన కల్పిస్తారు. గొర్రెలు, మేకల, పశువుల కాపరులుగా పనిచేస్తున్న వారిని, రోడ్లపై భిక్షాటన చేసేవారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ఇచ్చి వారికి అప్పగిస్తారు. పిల్లలకు ఎవరూ లేకపోతే ప్రభుత్వం నిర్వహించే స్టేట్ హోమ్‌కు పంపుతారు. కుటుంబాల నుంచి విడిపోయిన, తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి దర్పణ్ అనే ఫేషియల్ రికగ్నిషన్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నారు.
ఏడేండ్లలో 1,392 మందికి విముక్తి
స్పెషల్ టీమ్‌లు జిల్లాలో పర్యటిస్తూ బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించనున్నారు. 18 ఏండ్ల పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం లేదా స్టేట్ హోమ్‌కు తరలించి స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించనున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం, అయినవాళ్లు లేకపోతే స్టేట్ హోమ్‌కు తరలించి స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించనున్నారు. మంచిర్యాల జిల్లాలో 2017 నుంచి 2023 వరకు ఏడేండ్లలో 1,392 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వీరిలో 1,073 మంది బాలురు, 319 మంది బాలికలు ఉన్నారు.
పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలి. పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రతి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో ఎస్ఐ, నలుగురు సిబ్బందితో టీమ్‌లను ఏర్పాటు చేశాం. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే సబ్‌డివిజన్ ఇన్చార్జి ఆఫీసర్లకు సమాచారం అందించాలి. అలాగే 1098, డయల్ 100కు, లేదా లోకల్పోలీసులకు కూడా సమాచారం ఇవ్వొచ్చు. అందరం కలిసి బాలలకు బంగారు భవిష్యత్‌ను కానుకగా ఇవ్వాలి. ఆపరేషన్ ముస్కాన్విజయవంతానికి సహకరించాలి.
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్