నిఘాలేక. చోరీలు లాక్​ చేసిన ఇండ్లలో దొంగతనాలు

 నిఘాలేక. చోరీలు లాక్​ చేసిన ఇండ్లలో దొంగతనాలు

జిల్లాలో వరుస దొంగతనాలు జనాన్ని కలవర పెడుతున్నాయి. ఇండ్లకు లాక్​ చేసి బయటకు వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగిపోతోంది. కేసులు నమోదు చేసి నష్టాలను లెక్కిస్తున్న పోలీసులు అంతే వేగంగా దొంగలను పట్టుకొని సొత్తు రికవరీ చేయడంలో సక్సెస్​ కాలేకపోతున్నారు. పోయిన సొత్తు తిరిగి వస్తుందనే నమ్మకం బాధితుల్లో సన్నగిల్లుతోంది.  చైన్​ స్నాచింగ్​ లు ఆగడంలేదు.  వాహనాల దొంగతనాలు సాధారణమయ్యాయి. నేరాల అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో నేరాలు అదుపు చేసేందుకు  పోలీస్​ డిపార్ట్​మెంట్​లో సివిల్, స్పెషల్​బ్రాంచ్, ఇంటిలిజెన్స్, సీసీఎస్, డీసీఆర్​బీ తదితర విభాగాలు ఉన్నాయి. దొంగతనం జరిగిన తర్వాత సంబంధిత ఠాణాలలో కేసులు నమోదు చేసి దర్యాప్తు  అధిక శాతం సీసీఎస్​ పోలీసులకు అప్పగిస్తారు.  దొంగలను పట్టుకోవడం సొత్తు రికవరీని మాత్రమే సీసీఎస్​ పర్యవేక్షిస్తుంది.  ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సివిల్​ పోలీసులు వారికి సహకారం అందిస్తారు.  జనవరి నుంచి ఇప్పటి వరకు చోరీ కేసుల సంఖ్య 300  దాటింది. 

బంగారు ఆభరణాలు, నగదు కలిపి సుమారు రూ.5 కోట్లు చోరీ అయ్యింది. అందులో 10 శాతం కూడా రికవరీ  కాలేదు. పల్లెల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ దొంగతనాలు చేస్తూ  పోలీస్​లకు దొంగలు  సవాల్​ విసురుతున్నారు. నిఘా వ్యవస్థ  పటిష్టంగా  లేక చోరీలు నిత్యకృత్యమయ్యాయిపెరుగుతున్నాయి.  జైలు నుంచి బెయిల్​పై విడుదలైన దొంగల కదలికలను గమనించకపోవడం చోరీలు జరగడానికి కారణమని అంటున్నారు.

అక్టోబర్ లో జరిగిన దొంగతనాలు

5వ తేదీన నగరంలోని ఖలీల్​వాడీలో వరణ్య మెడికల్​ షాప్ షట్టర్లు పగులగొట్టిన దొంగలు పడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లగా వన్​టౌన్​లో కేసు నమోదైంది.

6న సీతారాంనగర్​ కాలనీలో ఓ ఇంట్లో పది తులాల బంగారం పట్టుకెళ్లారు. 5వ టౌన్​ పరిధిలో జరిగిన ఘటనలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్లు సీసీ ఫుటేజీలో ఆధారాలు దొరికాయి. అదే రోజు వర్ని మండల కేంద్రంలో మూడు దుకాణాలలో నగదు దొంగిలించారు.

న్యూఎన్జీవో కాలనీలోని ఓ కుటుంబం స్వస్థలం ఖమ్మం వెళ్లింది. ఈనెల 1న తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారం, 23 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు.   త్రీటౌన్​లో కేసు నమోదైంది.

అక్టోబర్​ 24న బడా భీంగల్​లో చిత్తరి లక్ష్మీ ఇంటిలో దొంగలు మూడున్నర తులాల బంగారం, నగదు పట్టుకెళ్లారు.

అక్టోబర్​14న బోధన్​లోని ఆచన్​పల్లిలో వెంకటేశ్వర్​రావు ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు వడ్ల కొనుగోలు కోసం దాచిన రూ.50 లక్షల నగదు, 20 తులాల బంగారం​చోరీ చేశారు. అదే రోజు శేఖర్​ఇంట్లో బీరువా పగులగొట్టి నగదు పట్టుకెళ్లారు. సీసీ ఫుటేజీలో దొంగల కదలికలు రికార్డయ్యాయి. 

బోధన్​లో రాత్రివేళ అన్నపూర్ణ సూపర్​ మార్కెట్​లాక్​ పగులగొట్టి రూ.15 లక్షల నగదు పట్టుకెళ్లారు. చౌడారెడ్డి  ఇంట్లో  12  తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి నగదు ఎత్తుకెళ్లారు. 

అక్టోబర్​ 13న నిజామాబాద్​లోని  వినాయక్​నగర్​ మెయిన్​రోడ్​లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల గోల్డ్​ చైన్​ లాక్కెళ్లగా 4వ టౌన్​లో కేసు నమోదైంది. అదే రోజు న్యూఎన్జీవో కాలనీలో ఒంటరిగా ఉన్న వృద్ధుడు సిద్ధిరాములు మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డయ్యింది.  

అక్టోబర్​ 26న వినాయక్​నగర్​ తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో బైక్​పై వచ్చిన  ఇద్దరు ఇంటి వద్ద నిల్చున్న వృద్ధురాలి మెడలో నుంచి చైన్​ లాక్కెళ్లారు. 

ఎడపల్లి మండలంలో గత నెలలో ఐదు ఆటో రిక్షాలు, ఎనిమిది బైక్ లు ఎత్తుకెళ్లారు. 

దొంగల పట్టివేతకు స్పెషల్​టీములు

మహారాష్ట్ర దొంగలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉంది. వారిని పట్టుకునేందుకు రెండు స్పెషల్​ టీంలు పనిచేస్తున్నాయి.   త్వరలో  పట్టుకుంటాం.  నిఘా లోపం లేదు. వేరే ప్రాంతాలకి వెళ్లేవారు ముందుగా మాకు పోలీసులకు చెప్పారు బంగారు ఆభరణాలు, నగదు భద్రపర్చే విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీనివాస్, ఏసీపీ, బోధన్​