- స్మగ్లర్లకు చెక్‌పెట్టేందుకు పోలీస్‌శాఖ ఉక్కుపాదం
- భద్రాచలం నుంచి ఆయా మెగా సిటీలకు గంజాయి రవాణా
- అరికట్టేందుకు ఆఫీసర్ల చర్యలు
- స్టాఫ్ భర్తీపై స్పెషల్ ఫోకస్
భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలోకి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌శాఖ రంగంలోకి దిగింది. స్మగ్లర్లకు చెక్ పెట్టి ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోకి గంజాయి వచ్చే ప్రధాన ద్వారం భద్రాచలం అని గుర్తించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్,ఆంధ్రా రాష్ట్రాలకు బార్డర్లో ఉన్న తెలంగాణలోని భద్రాచలం స్మగ్లర్లకు రాచమార్గం అని తేల్చారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇప్పుడున్న పటిష్టమైన నిఘాతో పాటు నార్కోటిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించనున్నారు.
నార్కోటిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు నేపథ్యంలో స్టాఫ్ భర్తీపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో ఆయా పోలీస్స్టేషన్లలో ప్రతిభ కనబరుస్తున్న పోలీసులను ఇందుకు ఎంచుకుంటున్నారు. సీఐ స్థాయి అధికారంతోపాటు ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ఎంపిక చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా, ప్రధాన నిందితుల గుర్తింపు, కేసులు నమోదు చేయడం, మూలాలు వెతకడం వీరి పూర్తిస్థాయి బాధ్యత. ఈ స్టేషన్లో పనిచేసేందుకు ఉత్సాహం చూపే వారికి హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. స్టాఫ్ భర్తీ పూర్తయ్యాక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు పోలీస్ శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
గంజాయి తరలింపు పరిస్థితి ఇదీ ..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భద్రాచలం మీదుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటకకు నిత్యం గంజాయి తరలిపోతోంది. 2021లో 74 కేసులు నమోదు చేసి 16,146 కిలోలు, 2022లో 50 కేసులు పెట్టి 24,001 కిలోలు, 2023లో 74 కేసులు నమోదు చేయడం ద్వారా 5,244 కిలోలు, 2024లో మార్చి నాటికి 35 కేసులు పెట్టి 2,781 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో రూ.84కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. 33,400 కిలోల గంజాయిని కాల్చారు. ఈ గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. జిల్లాలో 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయినా గంజాయి రవాణా ఆగడం లేదు. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రా మీదుగా భద్రాచలంకు స్పోర్ట్స్ బైక్స్, ప్రైవేటు కార్లు, ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నారు.
భద్రాచలం నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి మెగా సిటీలకు రవాణా జరుగుతోంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం మీదుగా హైదరాబాద్‌కు, భద్రాచలం నుంచి కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం నుంచి ఇల్లెందు ఇలా రకరకాల మార్గాలను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి కొందరు స్టూడెంట్లు భద్రాచలం ఏజెన్సీకి టూర్‌కు వచ్చారు.
ప్రైవేటు ట్రావెల్స్ కారును తెచ్చుకున్నారు. అయితే ఆ కారు డ్రైవరు గంజాయి స్మగ్లర్. అతడు గంజాయి స్మగ్లర్లకు రూట్‌మ్యాప్ చూపుతూ ఈ స్టూడెంట్లకు తెలియకుండా కొరియర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడి సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసుల వద్ద ఉంది. కారుతో సహా అతడిని అదుపులోకి తీసుకోవడంతో స్టూడెంట్లు బెంబేలెత్తారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారికి పూర్తి వివరాలు చెప్పి వేరే బస్సులో హైదరాబాద్‌కు పంపించారు. ఇలా పాల వ్యాన్లు, కంటైనర్లు, కూరగాయల వాహనాలు, మొక్కల చాటున పుష్ప సినిమా తరహాలో స్మగ్లర్లు గంజాయిని తరలిస్తున్నారు.