ప్రజల వద్దకు పోలీస్ బాసులు .. నల్గొండ, సూర్యాపేట ఎస్పీల వినూత్న కార్యక్రమం

ప్రజల వద్దకు పోలీస్ బాసులు .. నల్గొండ, సూర్యాపేట ఎస్పీల వినూత్న కార్యక్రమం
  • డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు
  • ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు.. ప్రతి బుధవారం ప్రజా భరోసా 

నల్గొండ, వెలుగు :  ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు చేరువయ్యేందుకు పోలీస్ బాసులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. గతంలో అమలు చేసిన విలేజ్ పోలీస్ కార్యక్రమానికి కొనసాగింపుగా ప్రజల్లోకి ప్రజా పాలనను తీసుకెళ్లేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలు ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రతి బుధవారం ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు.

డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా..

ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక పక్కదారి పడుతున్న యువతను సరైన మార్గంలో నడిపించేందుకు నల్గొండ  ఎస్పీ శరత్ చంద్ర పవార్ సరికొత్త ఆలోచనతో ‘యువ తేజం’ పేరుతో పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 10 వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో కనీసం రూ.30 వేల బేసిక్  పే నుంచి ఉద్యోగాలు కల్పించారు.

 పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రారంభించారు. మొత్తం 112 కంపెనీల్లో సుమారు 2,500 ఖాళీలు భర్తీ చేశారు. ఈ జాబ్​మేళాకు మొత్తం 4 వేల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఎక్కువగా రూ.45 వేల జీతానికి అపాయింట్​మెంట్​లెటర్లు ఇచ్చారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన వచ్చింది. 

‘ప్రజా భరోసా’తో ప్రజల్లోకి..

ప్రతి బుధవారం పోలీస్‌‌ ప్రజా భరోసా కార్యక్రమం పేరుతో గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ పౌరులకు చట్టాలపై అవగాన కల్పించనున్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి, హత్యలు, దోపిడీలకు పాల్పడకుండా,సమస్యలు సృష్టించే వారిలో మార్పు తీసుకురావడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడం, శాంతియుత వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంచుకొని డీఎస్పీ, సీఐ, ఎస్‌‌ఐలు ప్రతి బుధవారం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తారు. 

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు గ్రామ పోలీస్‌‌ అధికారి పనిచేస్తారు. ప్రతి వారం ఏదో ఒక గ్రామంలో ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరుకానున్నారు.రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా సూర్యాపేట జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకావడం గమనార్హం.