పోలీస్ జాబ్స్‌కు ప్రిపేరయ్యేటోళ్లకు ఫ్రీ కోచింగ్

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేరయ్యేటోళ్లకు ఫ్రీ కోచింగ్

రాష్ట్రంలోని హోంశాఖలో త్వరలోనే నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో యూనిఫామ్ జాబ్స్ ( ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు) కొట్టాలన్న లక్ష్యం ఉన్న నిరుద్యోగులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇలాంటి వారికి కమిషనరేట్ల వారీగా ఉచిత కోచింగ్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని కమిషనరేట్ల వారీగా అర్హులైన వారిని ఎంపిక చేసి ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులు కూడా కోచింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అధిక సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ వస్తోంది. ఏటా డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యే సిబ్బంది పెరగడం, కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటుతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తో గతంలో 2016 లో 9 వేల పోస్టులు, 2018 లో 16 వేల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం.. ఈ సారి 18 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి రెడీ అవుతోంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నిరుద్యోగులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసే అవకాశం ఉంది.

ఫిజికల్ కోచింగ్ తో పాటు ఎగ్జామ్ కోసమూ..

పోలీస్ శాఖ తరపున ఉచిత కోచింగ్ ఇవ్వాలనే డీజీపీ సూచనతో అన్ని కమిషనరేట్ల పరిధిలో అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి గ్రౌండ్ లెవల్ ఫిజికల్ కోచింగ్ తో పాటు రాత పరీక్ష కోసం కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి.  త్వరలోనే పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ వస్తుందని, నిరుద్యోగుల కోసం పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.