మునుగోడు ఎన్నిక నేపథ్యంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మునుగోడుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు మూసారాం చౌరస్తా వద్ద ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు పోలీసుల తీరును నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
మూసారాంబాగ్ వద్ద పోలీసు వలయం దాటుకుని వెళ్లిన బండి సంజయ్ కాన్వాయ్ ను వనస్థలిపురంలో అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అది సాధ్యంకాకపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద కాన్వాయ్ ను అడ్డుకున్నారు. హైవేపై బారికేడ్లు, పోలీస్ వెహికిల్స్ ను అడ్డుపెట్టి బండి సంజయ్ మునుగోడుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో బండితో పాటు బీజేపీ కార్యకర్తలు హైవేపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అర్థరాత్రి 1:45 గంటల బండి సంజయ్తో పాటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.