ఈటల రాజేందర్ ప్రచారానికి పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు : బీజేపీ నేతలు

పలివెల ఘటనపై సీఈవో వికాస్​రాజ్​కు బీజేపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడి చేసిన టీఆర్​ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు సీఈవో వికాస్ రాజ్​ను కోరారు. బీజేపీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, గోకుల్ రామారావు, ఎన్.వి సుభాష్​​ బుధవారం సీఈవోను కలిసి కంప్లైంట్ చేశారు. పలివెల గ్రామంలో ప్రచారం చేస్తున్న ఈటల రాజేందర్ కాన్వాయ్​పై రాళ్లు, కట్టెలతో పల్లా రాజేశ్వర్​ రెడ్డి, టీఆర్​ఎస్​ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. 

ఈ ఘటనలో ఆయన గన్​మన్, పీఆర్వోతో పాటు అనుచరులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార రథంతో పాటు కాన్వాయ్ లోని 6 వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయని వివరించారు. ఈటల రాజేందర్ ప్రచారానికి పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదన్నారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు మోహరించాలని గతంలో కోరినట్లు గుర్తు చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు.