గంటలో పెండ్లి.. పోలీసుల ఎంట్రీ ... మోసం చేశాడని ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన వివాహం

కమలాపూర్, వెలుగు : మరో గంటలో పెండ్లి పూర్తవుతుందనగా వరుడి మాజీ ప్రియురాలు, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం ఉప్పల్‌‌‌‌‌‌‌‌లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కౌటాల మండలం బోధన్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన సాయికి అదే మండలం చింతలమానపల్లికి చెందిన యువతితో 2019లో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. కానీ సాయి కమలాపూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని ఉప్పల్‌‌‌‌‌‌‌‌కు చెందిన మరో యువతితో పెండ్లికి సిద్ధపడ్డాడు. బుధవారం ఉప్పల్‌‌‌‌‌‌‌‌లో వివాహం జరగాల్సి ఉంది.

విషయం తెలుసుకున్న సాయి మాజీ ప్రియురాలు కౌటాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు పెండ్లి జరుగుతున్న ప్లేస్‌‌‌‌‌‌‌‌కు వచ్చాయి. పోలీసులను గమనించిన సాయి పక్కనే ఉన్న ఓ ఇంట్లో దూరి తలుపులు వేసుకున్నాడు. బయటకు రావాలని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా చచ్చిపోతానని బెదిరించాడు. సుమారు 3 నుంచి 4 గంటలు అయినా సాయి బయటకు రాకపోవడంతో పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో సాయిని బయటకు తీసుకొచ్చి స్వగ్రామానికి తీసుకెళ్లారు.