హైదరాబాద్, వెలుగు: దిశ నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారంలో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ను సవాలు చేస్తూ సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేసిన పిటిషన్ల అంశం తేలేదాకా ఈ కేసు విచారణను వాయిదా వేయాలంటూ పోలీసు అధికారులు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కౌంటరు దాఖలు చేయాలంటూ పిటిషనర్లను ఆదేశించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన పిల్తో పాటు ఇతర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుల బెంచ్ సోమవారం విచారణను కొనసాగించింది.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. సుప్రీం ఆదేశాల మేరకు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించిందన్నారు. ఆ నివేదిక చట్టబద్ధతను సవాలు చేస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేశామని, ఒకవేళ సింగిల్ జడ్జి తమ పిటిషన్లను అనుమతించిన పక్షంలో దాని ఆధారంగా ఇక్కడ చేసిన వాదనలకు విలువలేదన్నారు. అలాగే, విచారణను వాయిదా వేయాలన్న పోలీసు అధికారుల మధ్యంతర పిటిషన్లో కౌంటరు దాఖలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు.