- డిసెంబర్ 4న సంధ్య టాకీస్ బయట,
- లోపల ఏం జరిగిందో వీడియోలు రిలీజ్
- మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పోలీసులు
- పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కో రాక
- రాత్రి 9.30కి వస్తూ వస్తూనే కారు సన్‌రూఫ్ ఎక్కి అభివాదాలు.. ఫ్లయింగ్ కిస్‌లు
- అప్పటికే భారీగా జనం.. అదుపుతప్పిన పరిస్థితి.. సినిమా హాల్లోకి వెళ్లిన అర్జున్
- రాత్రి 9.50కి తొక్కిసలాటలో రేవతి మృతి, ఆమె కొడుకు శ్రీతేజ్ కండీషన్ సీరియస్
- పోలీసులు విషయం చెప్పినా వినిపించుకోని పుష్ప.. సినిమా మొత్తం చూసే వెళ్తానని వ్యాఖ్య
- అర్ధరాత్రి 12.05 గంటలకు బలవంతంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు
- ఇంటికి వెళ్తూ కూడా సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు.. ఆధారాలు బయటపెట్టిన సీపీ ఆనంద్
- చెప్పినా వినిపించుకోలేదు.. సినిమా చూసే వెళ్తానన్నాడు: ఏసీపీ రమేశ్
- అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టుకు పోలీసులు!
హైదరాబాద్, వెలుగు: పుష్ప హీరో అల్లు అర్జున్ తీరుపై పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు టాకీస్‌లో పోలీసులెవరూ తనను కలువలేదని ఆయన బుకాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చినప్పుడు బయట, లోపల ఏం జరిగిందో మినిట్ టు మినిట్.. పిన్ టు పిన్ వీడియో సాక్ష్యాలను పోలీసులు రిలీజ్ చేశారు.
పర్మిషన్ లేకున్నా అల్లు అర్జున్ అండ్ కో సంధ్య థియేటర్‌కు వచ్చారని, ర్యాలీ తీశారని, దాని ఫలితంగానే తొక్కిసలాట జరిగి ఓ మహిళ నిండు ప్రాణం పోయిందని తెలిపారు. ఆమె కొడుకు చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారని వెల్లడించారు. బయట తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని చెప్పినప్పటికీ సినిమా మొత్తం చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారని.. చివరికి బలవంతంగా తాము బయటకు తీసుకువచ్చామని పోలీసులు చెప్పారు. డిసెంబర్ 4న రాత్రి 9.15 నుంచి అర్ధరాత్రి 12.05 గంటల వరకు ఏం జరిగిందో పోలీసులు బయటపెట్టిన వీడియోల్లో స్పష్టంగా ఉంది.
వెళ్తూ వెళ్తూ కూడా కారు సన్ రూఫ్ ఎక్కి అల్లు అర్జున్ అభివాదం చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. 2024 సిటీ పోలీసుల వార్షిక నివేదిక విడుదలలో భాగంగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీపీ సీవీ ఆనంద్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సంధ్య థియేటర్ ఘటన, పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలపై ఈ సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో దాదాపు 10 నిమిషాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపించారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో జనాలకు తెలుస్తుందని సీపీ అన్నారు. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తే తప్ప థియేటర్ నుంచి అల్లు అర్జున్ అండ్ కో బయటకు రాలేదని తెలిపారు.డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు సంధ్య థియేటర్‌కు దాదాపు 40 నుంచి 50 మంది బౌన్సర్లతో వస్తూ వస్తూనే అల్లు అర్జున్తన కార్ సన్ రూఫ్‌పైకి ఎక్కి అభివాదాలు చేస్తూ, ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ హల్చల్ చేస్తున్నప్పటి దృశ్యాలు పోలీసులు విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అదే జోష్‌తో థియేటర్‌లోపలికి అల్లు అర్జున్ వెళ్లడం.. ఆయనను చూసేందుకు జనం ఎగబడటం.. రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ్ ఒకవైపు.. ఆమె భర్త, కూతురు మరోవైపు చెల్లాచెదురు కావడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అదే సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి, శ్రీతేజ్ స్పృహతప్పి పడిపోవడం.. వారికి పోలీసులు సీపీఆర్ చేస్తున్న దృశ్యాలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రౌడ్‌ను కంట్రోల్ చేస్తూనే.. అర్దరాత్రి 12.05 గంటలకు అల్లు అర్జున్ను బలవంతంగా పోలీసులు బయటకు తీసుకువస్తున్నప్పటి వీడియో కూడా ఉంది. ఇంటికి వెళ్తూ కూడా కారు సన్ రూఫ్ ఎక్కి అల్లు అర్జున్ అభివాదం చేయడం అందులో కనిపిస్తున్నది.
అనుమతి ఇవ్వలేదు: సీపీ
తొక్కిసలాట ఎలా జరిగిందో సీపీ సీవీ ఆనంద్ మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భార్యాపిల్లలు సహా కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ వచ్చిన సంగతి వివరించారు. వీరంతా రాక ముందు థియేటర్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి.. వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిపారు. పుష్ప2 బెనిఫిట్ షోకు సెలబ్రెటీలు వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన లెటర్‌ను కోర్టుకు అందించినట్లు వెల్లడించారు.
సంధ్య థియేటర్ 70 ఎంఎం, 35 ఎంఎం థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయని తెలిపారు. రెండు థియేటర్లలో దాదాపు 2,520 మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. రెండింటికీ ఒకే కామన్ ఎంట్రన్స్, ఎగ్జిట్ఉన్నాయని ఆయన తెలిపారు. బెన్ఫిట్ షో రోజు దాదాపు 7 వేల మందికి పైగా అక్కడికి చేరుకున్న వీడియోను ప్రదర్శించారు. సినిమాకు అల్లు అర్జున్ ఆయన భార్యపిల్లలతో కలిసి వచ్చిన సందర్భంగా బౌన్సర్ల హడావుడి ఎలా ఉందో వీడియో ఫుటేజీని అందించారు.
నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది.. ఇన్స్పెక్టర్ రాజునాయక్ కన్నీళ్లు
ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజునాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేవతికి తాను, ఎస్ఐ మౌనిక సీపీఆర్ చేసిన వీడియో చూసి కంటతడి పెట్టారు. ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. “తొక్కిసలాట జరిగిన సమయంలో నేను అక్కడే ఉన్న. కిందపడిపోయిన రేవతిని గుర్తించి నేను, మా ఎస్ఐ మౌనిక ఆమెను కాపాడే ప్రయత్నం చేశాం. సీపీఆర్ చేశాం. ఎంత ప్రయత్నించినా రేవతిని బతికించలేకపోయా. ఆమె ప్రాణాలు నా చేతుల్లోనే పోయాయి. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. గత 15 రోజులుగా మనశ్శాంతి లేదు” అని రాజునాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
పుష్ప ఇలా దొరికిండు
డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమించిన విషయం మరుసటి రోజు తనకు తెలిసిందంటూ డిసెంబర్ 6న అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశారు. తొక్కిసలాటఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ 11గా అల్లు అర్జున్ను చేర్చి.. ఈ నెల 13న అరెస్ట్ చేశారు. అదేరోజు బెయిల్ రావడంతో మరుసటిరోజు తెల్లారి అర్జున్ రిలీజ్ అయ్యారు. ఇదే క్రమంలో శనివారం అసెంబ్లీలో మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు బదులుగా సీఎం రేవంత్‌రెడ్డి.. సంధ్య థియేటర్ ఘటనను వివరించారు. అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి.. తనకు రేవతి మరణించిన విషయం మరుసటి రోజు తెలిసిందని మరోసారి చెప్పుకొచ్చారు.
బయట ఏం జరుగుతున్నదో ఆరోజు తనకు పోలీసులు చెప్పలేదన్నారు. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకొని.. అసలు ఏం జరిగిందో వీడియోల్లో బయటపెట్టారు. అనుమతులు లేకుండానే రోడ్ షో చేపట్టారని, బయట ఓ మహిళ చనిపోయిందని చెప్పినా సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారని వెల్లడించారు. సాక్ష్యాలను బయటపెట్టారు. కాగా.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అనుమానంతో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను కూడా రద్దు చేయించేందుకు హైకోర్టును పోలీసులు ఆశ్రయించే అవకాశం ఉంది.
సినిమా మొత్తం చూసే వెళ్తానన్నాడు: ఏసీపీ రమేశ్
చిక్కడపల్లి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ డిసెంబర్ 4న జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. ‘‘అల్లు అర్జున్ థియేటర్‌కు రాకముందే వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. అల్లు అర్జున్ కానీ ఇతర సెలబ్రిటీలు కానీ రావడానికి మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం.
అల్లు అర్జున్ భార్యాపిల్లలు, ఆయన మామ కూడా థియేటర్‌కు వచ్చారు. అల్లు అర్జున్ ర్యాలీగా థియేటర్ వద్దకు వచ్చారు. అప్పటికే అభిమానులు కిక్కిరిసిపోయారు. ఆయనను చూసే క్రమంలో గేట్ విరిగిపోయింది. బౌన్సర్లు అల్లు అర్జున్ను లోపలికి తీసుకెళ్లారు. తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. కాపాడేందుకు ఇన్స్పెక్టర్ రాజు, ఎస్ఐ మౌనిక ప్రయత్నించారు. రేవతి కుమారుడు స్పృహ తప్పడంతో హాస్పిటల్‌కు తరలించాం” అని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌కుమార్ వివరించారు.
‘‘రేవతి మృతి చెందిన విషయం చెప్పేందుకు నేను థియేటర్ లోపలికి వెళ్లాను. అల్లు అర్జున్‌కు విషయం చెప్పేం దుకు ప్రయత్నించాను. థియేటర్ బయట పరిస్థితి బాగోలేదని చెప్పడానికి వెళ్లాను. కానీ, అక్కడ ఉన్న అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ అనుమతించలేదు. విషయం ఏంటో చెప్పు నేను చెప్తానని అన్నాడు. అప్పటికే పది నిమిషాలు గడిచింది. థియేటర్ బయట ఉద్రిక్తత పరిస్థితి నెల కొనడంతో మా డీసీపీ సర్ అక్కడికొచ్చారు. అల్లు అర్జున్ వెళ్లిపోకపోతే అరెస్ట్ చేస్తామన్నం. అయినప్పటికీ సినిమా చూసి వెళ్తానని అల్లు అర్జున్ చెప్పారు. బల వంతంగా ఆయనను బయటకు తీసువచ్చాం” అని ఏసీపీ రమేశ్ వెల్లడించారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎంపీ అనిల్
సంధ్య థియేటర్తొక్కిసలాట వంటి ఘటనల సందర్భంలో సెలెబ్రిటీ లైనా, రాజకీయ నాయకులైనా బాధ్యతయుతంగా వ్యవహరించాలని ఎంపీ అనిల్ కుమార్ కోరారు. ఆదివారం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక మహిళ మృతిచెంది, బాలుడు ఆసుపత్రిలో ఉంటే.. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడే సమయంలో కొంచమైనా మానవత్వం కనిపించలేదన్నారు. తాను తప్పు చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాడే తప్ప అతనిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు.
శ్రీతేజ్‌ను పరామర్శించా: సినీనటుడు జగపతిబాబు
ఆసుప్రతిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నటుడు జగపతి బాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాబు ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకొని రేవతి కుటుంబానికి ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం జగపతి బాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను షూటింగ్ నుండి తిరిగి హైదరాబాద్ రాగానే వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించానని తెలిపారు.
ఇలాంటివి రిపీట్ కానివ్వొద్దు: ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను ఆయన ఆదివారం ఆసుప్రతికి వచ్చి పరామర్శించారు. తర్వాత మాట్లాడుతూ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని అన్నారు. ఏపీలో కూడా సీఎం చంద్రబాబు ఇలాగే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.