
- ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్.. అబ్యూజ్ కంటెంట్‌పై నిరంతరం నిఘా
- సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా బూతు కంటెంట్
- రాయలేని భాషలో తిట్లు, అసభ్యకర కామెంట్స్
- సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా బాధితులే
- మహిళలను, చివరికి చిన్న పిల్లలనూ వదలట్లే
- అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన
- ఆ తర్వాతే సీరియస్‌గా దృష్టిపెట్టిన పోలీస్‌శాఖ
- 9 వేలకు పైగా -గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపులపై పోలీసుల కన్ను
- అబ్యూజ్ కంటెంట్‌కు 3--7 ఏండ్ల జైలు, రూ.10 లక్షల వరకూ జరిమానా పడే చాన్స్
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియా అంటే ఒకప్పుడు కేవలం సమాచార వేదిక. మన భావాలను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే ఈ మాధ్యమం ఇప్పుడు. బూతులకు, అసభ్య కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. సీఎం అయినా.. ప్రతిపక్ష నేత అయినా.. హీరో అయినా.. అధికారి అయినా.. సామాన్యుడైనా.. హోదా లేదు, మర్యాద లేదు, పోస్టు పెట్టడమే తర్వాయి కొందరు చెప్పరాని భాషతో విరుచుకుపడుతున్నారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా విషం చిమ్ముతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అబ్యూజ్కామెంట్స్బాధితుడే. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న బూతుల దాడిని ఇటీవల అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు.
ఆ రాతలు, మాటలు వింటే అన్నం కూడా తినబుద్ధి కాదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలతో అలర్ట్ అయిన పోలీసులు సోషల్‌మీడియా బూతురాయుళ్లపై నిఘా పెట్టారు. రెండు దశల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలీసులు భావిస్తున్నారు. మొదటి దశలో సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకొని అసభ్యకర కామెంట్లు పెడ్తున్న వారిని గుర్తిస్తున్నారు. రెండో దశలో బూతు కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. అబ్యూస్ పోస్టులను, బూతు కామెంట్లను అటోమెటిక్‌గా గుర్తించి అలర్ట్చేసేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాఫ్ట్ వేర్‌ను వినియోగించబోతున్నారు.
దీనికి కేంద్ర సర్కారు పర్మిషన్ అవసరం కావడంతో ఆ మేరకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఇక ఏఐ ఆధారిత ఫిల్టర్లతో అసభ్య కామెంట్లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే సిస్టమ్‌లు ఏమేమి ఉన్నాయో కూడా పోలీసు శాఖ స్టడీ చేస్తున్నది. కొద్దిరోజుల్లోనే దీనిపై క్లారిటీ రానున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘వెలుగు’కు చెప్పారు. దీంతోపాటు సినీ నటులు, యూట్యూబర్లతో నూ వీడియోలు చేయించాలని ఆ శాఖ ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు పాఠశాలల్లో ‘డిజిటల్ ఎథిక్స్’ను ఒక సబ్జెక్ట్‌గా చేర్చాలని సీఎం చెప్పడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్ దాకా మానిటరింగ్
ఆన్‌లైన్ లో బూతు కంటెంట్‌ను అడ్డుకునేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేకంగా ‘సోషల్ మీడియా మానిటరింగ్ సెల్’ ఏర్పాటు చేసి, 24x7 నిఘా పెడుతున్నది. ఫేస్‌బుక్ పోస్టుల నుంచి ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌ల వరకూ, ఇన్‌స్టా రీల్స్ నుంచి వాట్సాప్ చాట్‌ల వరకూ... ప్రతిదీ ఈ సెల్ రాడార్‌లో ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపులపైనా నిఘా ఉంచుతున్నారు. ఈమేరకు ఆయా విలేజ్ వాట్సాప్ గ్రూప్‌లలో పోలీసులు జాయిన్ అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను అపాయింట్ చేస్తూ అటు డ్రగ్స్‌తోపాటు ఇలాంటి అబ్యూస్ కంటెంట్‌పై మానిటరింగ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా వాట్సాప్ గ్రూప్‌లపై పోలీసులు నిఘా పెట్టారు. ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను సైతం వాడుతున్నారు. ఒక్కొక్కరి ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి, వారి లొకేషన్‌ను కనిపెడుతున్నారు. ఏ అసభ్య పోస్ట్‌నూ వదలబోమని, ఫేక్ అకౌంట్ వెనక ఎవరున్నా, ఎక్కడున్నా.. పట్టి తీరుతామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఫేక్ అకౌంట్లతో బూతు కామెంట్లు, కంటెంట్ పెట్టడమే కాకుండా రెచ్చగొట్టే లా అబ్యూస్కంటెంట్ వాడుతున్న కొందరిని గుర్తించారు. వారందరిపై సెబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యంగా వ్యవహరిస్తే వెంటనే స్క్రీన్‌షాట్ తీసి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
శిక్షలు పడ్తయ్జాగ్రత్త!
‘ఏదో కామెంట్ పెట్టాం. బూతు కటెంట్ షేర్ చేశాం.. మనకేమవుతుంది..’ అనుకుంటే ఇకపై అంతే సంగతులు. కఠిన శిక్షలతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 సెక్షన్ 66, 67, 67ఏ కింద అసభ్య కంటెంట్ షేర్ చేసినవారికి 3--7 ఏండ్ల జైలు, రూ.10 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది . భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు (బీఎన్ఎస్) 74, 79, 296 కింద మహిళలను, పిల్లలను కామెంట్ల రూపంలో వేధించినా శిక్ష ఉంటుంది. బీఎన్ఎస్ సెక్షన్ 78 ప్రకారం స్టాకింగ్ (ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో) చేస్తే అంటే ఒక యువతిని ఆన్‌లైన్‌లో నిరంతరం ఫాలో అయి, కామెంట్లు చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
బీఎన్ఎస్ సెక్షన్ 356 డిఫమేషన్ (పరువు నష్టం).. సోషల్ మీడియాలో ఒకరి గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు పెడితే రెండేండ్ల వరకూ సాధారణ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ వేస్తారు. ఉదాహరణకు ఒకరి గురించి అబద్ధపు ఆరోపణలు పోస్ట్ చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుందని పోలీసులు చెబుతున్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 296 ప్రకారం పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యమైన మాటలు, పాటలు లేదా చర్యలకు శిక్ష ఉంటుంది. సోషల్ మీడియా కూడా ఇప్పుడు పబ్లిక్ ప్లేస్‌గా పరిగణించబడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 3 నెలల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉండనున్నాయి.
ఉదాహరణగా ఇన్‌స్టా, వాట్సాప్, ఫేస్‌బుక్ , యూట్యూబ్ లైవ్‌లో బూతు మాటలు మాట్లాడితే ఈ సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. సెక్షన్ 66ఈ (ఐటీ యాక్ట్) ప్రకారం ఒకరి అనుమతి లేకుండా ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం (ప్రైవసీ ఉల్లంఘన) కిందకు వస్తుంది. ఒక యువతి ఫొటోను ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తే, ఈ సెక్షన్ వర్తిస్తుంది. సెక్షన్ 67ఏ (ఐటీ యాక్ట్) ప్రకారం లైంగికంగా స్పష్టమైన కంటెంట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేయడం లేదా ట్రాన్స్‌మిట్ చేయడం అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య రీల్ అప్‌లోడ్ చేసిన వ్యక్తిపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోవచ్చని అధికారులు
చెబుతున్నారు.
వేధింపులతో ఆత్మహత్యల దాకా..
ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్... పేర్లు ఏవైనా.. వేదిక ఏదైనా.. వేధింపులు ఒక్కటే. అడ్డూ అదుపూ లేకుండా బూతు జోకులు, అనుచిత ఫార్వర్డ్‌లు, బాడీ షేమింగ్లు ఉంటున్నాయి. ఒక యువతి తన డాన్స్ వీడియో షేర్ చేస్తే, “ఏంటి ఈ డ్రెస్?”, “ఫోన్ నంబర్ ఇవ్వు” అంటూ కామెంట్లు. ఇది సాధారణం మాత్రమే. ఇంతకంటే దారుణమైన బూతులు వాడుతున్నారు. కొన్నిసార్లు ఒక్క పోస్ట్‌తో కుటుంబాలే ఛిన్నాభిన్నమవుతున్నాయి.
సోషల్ మీడియా బాధితుల్లో సెలబ్రిటిలే కాకుండా సామాన్యులు సైతం ఉంటున్నారు. ఒక గృహిణి తన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే, ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చే కామెంట్లు చూసి కుటుంబమంతా ఆత్మహత్యల దాకా వెళ్లిన సందర్భాలున్నాయి. ఇక సెలబ్రిటీలకూ ఈ బాధ తప్పడం లేదు. తమ అమ్మాయి నటించిన సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశాక.. కింద వచ్చిన కామెంట్లను చూసి ఓ తండ్రి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. “మా అమ్మాయి సినిమా ట్రైలర్ రిలీజైందని ఆనందంగా కామెంట్ సెక్షన్ చూస్తే ఏడుపొచ్చింది” అంటూ ఆయన ట్విటర్లో రాసుకొచ్చారు. ఇదీ పరిస్థితి!
ఫన్ పేరుతో బూతులు మాట్లాడినా సీరియస్ యాక్షన్
బూతు కంటెంట్ పోస్ట్ చేస్తున్న వారితో పాటు అలాంటి కామెంట్లు పెట్టేవాళ్లపైనా సీరియస్ యాక్షన్ ఉంటుంది. వాళ్లు ఎక్కడున్నా పట్టుకొని చార్జ్‌షీట్ వేస్తాం. కంప్లయింట్ల ఆధారంగానే కాకుండా సోషల్ మీడియాలో బూతు కామెంట్లు, కంటెంట్ కనిపెట్టేందుకు ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. ప్రజాప్రతినిధులు ఇలాంటి బూతులు తిట్టినా, అలాంటి కంటెంట్, కామెంట్లు పెట్టినా కేసు పెట్టి, ప్రజాప్రతినిధుల కోర్టులకు పంపుతున్నాం.
ఇక సాధారణ ప్రజలపై కేసులు పెట్టి సివిలియన్ కోర్టులకు పంపుతున్నాం. చాలామంది యూజర్లకు బూతు కంటెంట్ షేర్ చేస్తే చట్టపరమైన శిక్షలు ఉంటాయని తెలియడం లేదు. ఫేక్ వీడియోలు, ఫొటో ఎడిటింగ్ లాంటి టూల్స్‌తో అసభ్య కంటెంట్ సృష్టిస్తున్నారు. యువతలో సోషల్ మీడియాను ‘ఫన్’ కోసం వాడే ధోరణి పెరిగింది. అన్ని రాజకీయ పార్టీల లీడర్లకు, సెలబ్రిటీలకు, ప్రజలకు మాట్లాడే భాష, చేస్తున్న కామెంట్లపై స్వీయ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది.
కఠిన చర్యలు తప్పవు
రాజకీయ నేతలు, మహిళలు, చిన్నారులు సహా ఎవరినైనా సరే కించపరిచే విధంగా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. ఫాలోవర్స్ ఎక్కువగా ఉండే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పైత్యం ఎక్కువగా ఉంటున్నది. అబ్యూస్ కంటెంట్రిపీటెడ్గా పోస్ట్ చేసే వారిపై బీఎన్‌ఎస్ 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నాం. దీని ప్రకారం కోర్టులు 10 ఏండ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
– డి. కవిత, డీసీపీ, సీటీ సైబర్ క్రైమ్
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజకీయ ప్రత్యర్థులు కొంతకాలంగా సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు, బూతు కామెంట్లతో దాడిచేస్తున్నారు. కడియం పట్టించుకోకపోవడంతో తాజాగా ఆయన తల్లిని టార్గెట్చేశారు. ఆమె వయస్సు ప్రస్తుతం 97 ఏండ్లు కాగా, ఆ పెద్దావిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుండడంతో శనివారం కడియం బహిరంగంగా తన ఆవేదన వెలిబుచ్చారు. ‘నా పేరు స్థానంలో మీ పేరు పెట్టుకొని చదివితే నా బాధ అర్థమవుతుంది’ అంటూ బాధపడ్డారు.
కరీంనగర్‌లో ఓ గృహిణి తన కుమార్తె బర్త్‌డే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాని కింద “ఈ అమ్మాయి ఇంకా పెరిగితే...” అని ఒకరు, “మీ ఇంటికి ఒకసారి రావొచ్చా?” అని మరొకరు కామెంట్ చేశారు. ఆ కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీ (పిల్లలపై అసభ్య కంటెంట్), భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 79 కింద కేసు నమోదు చేసి, ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనికి ఏడాది జైలు శిక్ష పడింది.
వరంగల్‌కు చెందిన ఓ యువతి యూట్యూబ్‌లో ఫ్యాషన్ వీడియో పోస్ట్ చేసింది. దాని కింద వచ్చిన కామెంట్లలో “ఈ డ్రెస్‌తో ఎక్కడికి వెళ్తావ్?”, “నీతో ఒక రోజు గడపొచ్చా?” లాంటి అసభ్యకర వ్యాఖ్యలు ఉన్నాయి. ఆమె ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసి, రెండు ఫేక్ అకౌంట్లను ట్రాక్ చేశారు. నిందితుడికి రూ. 25వేల జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధించారు.
ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సతీమణి భారతిపై ఇటీవల కిరణ్ అనే యువకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారం రేపాయి. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో భారతి క్యారెక్టర్అసాసినేషన్చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, గురువారం కిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనను టీడీపీ సర్కారు సైతం సీరియస్‌గా తీసుకున్నది. ఈ మేరకు త్వరలో ‘సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్యాక్ట్’ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.