రౌడీ షీటర్లపై ..పోలీసుల నజర్

  •     నేరాల కట్టడికి ఖాకీల యాక్షన్
  •     నేర చరిత్ర ఉన్నవాళ్లకు కౌన్సెలింగ్.. గొడవలు చేసేవారికి వార్నింగ్​ 
  •     మరీ బరితెగిస్తే పీడీ యాక్టులు
  •     సత్ప్రవర్తన ఉంటే రౌడీ షీట్ తొలగింపునకు చర్యలు

హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్ లో పోలీసులు రౌడీ షీటర్లపై ఫోకస్ పెట్టారు. కొందరు లీడర్ల సపోర్టుతో భూ సెటిల్మెంట్లు, పంచాయతీలకు పాల్పడుతుండగా.. అలాంటి వారితో పాటు  తరచూ గొడవల్లో తలదూర్చే వారిపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లఘించే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసేందుకు  రెడీ అవుతున్నారు. అంతేగాకుండా వివిధ కారణాల వల్ల గతంలో రౌడీ షీట్  నమోదైన వాళ్లలో కొంతమంది వృద్ధులు

అనారోగ్యాల బారిన పడిన వాళ్లుఉండగా.. వారి ప్రస్తుత స్థితిగతులు, ప్రవర్తన బాగుంటే వారికి రౌడీ షీట్ నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  ఈ మేరకు వరంగల్ కమిషనరేట్ లోని స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లపై నిఘా పెట్టారు. వారి గురించి  ఆరా తీయడమే కాకుండా స్టేషన్లవారీగా కౌన్సిలింగ్​ కూడా నిర్వహిస్తున్నారు.

తీరు మారకపోతే పీడీ యాక్టే..

పోలీస్ కమిషనరేట్ పరిధిలో 780  మంది వరకు రౌడీ షీటర్లున్నారు. ఇందులో చాలామంది పొలిటికల్ లీడర్ల సపోర్టుతో దందా చేస్తున్నారు. భూదందాలు, సెటిల్ మెంట్లతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తల్వార్లు, కత్తులు తిప్పుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతోనే వరంగల్ కమిషనరేట్ లో నేరాల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది తీరుపై అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ముందుగా రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టారు.

దందాలు, గొడవలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్​ కూడా నిర్వహిస్తున్నారు. అయినా తీరు మార్చుకోని వారిపై పీడీ యాక్టులు కూడా నమోదు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.   గత మూడేండ్లలో తరచూ గొడవలకు దిగడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 48 మందిపై పీడీ యాక్టులు పెట్టగా.. ఇప్పుడు కూడా హిస్టరీ షీట్ ఉండి, జనాలను ఇబ్బందులకు గురి చేసే వారిపై నేరుగా పీడీ యాక్టు నమోదు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

మంచిగుంటే రౌడీ షీట్ ఎత్తివేత!

కమిషనరేట్ లో నేర చరిత్ర ఉన్నవారితో పాటు రౌడీ షీట్ నమోదై ఉన్నవారికి కొద్దిరోజులుగా స్టేషన్ల వారీగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో తరచూ గొడవలకు పాల్పడే వారికి సీరియస్ గా వార్నింగులు కూడా ఇస్తున్నారు. సత్ర్పవర్తన కలిగి ఉండటం, ఆరోగ్యం సహకరించని వారిపై రౌడీ షీట్ ఎత్తి వేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.   హసన్ పర్తి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన దేవేందర్ అనే వ్యక్తిపై రౌడీ షీట్ నమోదై ఉండగా.. కొద్దిరోజుల కిందట యాక్సిడెంట్ కు గురి కావడంతో ఆయన సక్రమంగా నడవలేని పరిస్థితి నెలకొంది.

దీంతో ఇటీవల  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ. బారి, ఏసీపీ డేవిడ్ రాజ్, సీఐ గోపి ఆయనపై రౌడీ షీట్ తొలగించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉంటే గతంలో వివిధ కారణాలు, ఘటనల వల్ల రౌడీ షీటర్ గా రికార్డుల్లోకి ఎక్కినవారిలో కొంతమంది  వృద్ధులు అయిపోగా.. అలాంటివారిలో 70 ఏండ్ల పైబడినవారు కూడా ఉన్నారు.  మరికొందరు వివిధ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుండగా..

ఇంకొందరు నేరాలకు దూరంగా ఉంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి వారికి అధికారులు మారినప్పుడల్లా స్టేషన్లకు వెళ్లాల్సి వస్తుండటంతో అలాంటి వాళ్లంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రౌడీ షీట్ ఉన్న కొందరు వృద్ధులు, అనారోగ్యానికి గురైనవాళ్లు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు తమపై రౌడీ షీట్ ఎత్తివేయాలంటూ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. 

గతంలో రౌడీ షీట్ తొలగింపు మేళా

2019 లో వరంగల్ సీపీ గా ఉన్న డా.విశ్వనాథ్ రవీందర్  ఎక్కడా లేనివిధంగా కమిషనరేట్ లో ప్రత్యేకంగా రౌడీ షీట్ తొలగింపు మేళా నిర్వహించారు. అప్పటివరకు కమిషనరేట్ లో 783 మంది రౌడీ షీటర్లు ఉండగా.. అందులో ఆరోగ్యం సహకరించని వృద్ధులు, సత్ప్రవర్తన కలిగిన 133 మందిపై రౌడీ షీట్లు ఎత్తివేశారు. మళ్లీ నేరాలకు పాల్పడితే రౌడీ షీట్ రీ ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తూనే వారిపై హిస్టరీ షీట్ తొలగించారు.

ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగా రౌడీ షీట్ తొలగింపు మేళా నిర్వహించి, సమాజానికి హాని కలిగించే పరిస్థితిలో లేనివారితో పాటు, ప్రవర్తన మార్చుకుని ఉంటున్న వారిపై రౌడీ షీట్ తొలగించాలని వేడుకుంటున్నారు. కాగా తాజాగా రౌడీ షీటర్లపై నిఘా పెట్టిన  పోలీసులు సత్ర్పవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు