- ఏటా రూ.100 కోట్ల సొత్తు దోచేస్తున్న దుండగులు
- సగం కేసులనే ఛేదిస్తున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏటా రూ.100 కోట్లకు పైగా సొత్తును దొంగలు దోచేస్తున్నారు. ఇందులో సగం కేసులను మాత్రమే పోలీసులు ఛేదిస్తున్నారు. దొంగలు దొరికినా సొమ్మును రికవరీ చేయడంలో చేతులెత్తేస్తున్నారు. చోరీ కేసుల్లో బాధితుల సొత్తు పూర్తిస్థాయిలో రికవరీ కావడంలేదు. తీవ్రమైన నేరాలు, రూ.కోట్లతో సంబంధమున్న కేసులు మినహా తక్కువ క్యాష్, బంగారం పోయిన కేసులను పోలీసులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన చోరీలు కేవలం పోలీస్ రికార్డులకే పరిమితమవుతున్నాయి. కొన్ని కేసులు ఏండ్లు గడుస్తున్నా ఎంక్వరైరీలోనే ఉంటున్నాయి. పోలీసుల రికార్డుల ప్రకారం గతేడాది రాష్ట్రంలో రూ.148 కోట్ల సొత్తు చోరీకి గురైంది. అందులో రూ.74 కోట్ల సొత్తును మాత్రమే రికవరీ చేశారు.
పూర్తిస్థాయిలో రికవరీ కాని సొత్తు
స్టేట్లో స్థానిక దొంగలతో పాటు అంతర్రాష్ట్ర ముఠాలు వరుస దొంగతనాలు చేస్తూ అందినకాడికి దోచుకెళ్తున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీసులు ముందుగా పాత నేరస్తులపైనే ఫోకస్ పెడుతుంటారు. కొన్ని కేసుల్లో నిజమైన దొంగలు చిక్కినా పోలీసులు అరెస్ట్ చేసేలోపే బంగారం, వెండి ఆభరణాలను తక్కువ ధరకు అమ్మేసి జల్సాలు చేస్తున్నారు. దీంతో దొంగలు దొరికినప్పటికీ వారి వద్ద నుంచి పోలీసులు సొమ్మును రికవరీ చేయలేకపోతున్నారు. కొన్ని కేసులను పెద్దగా పట్టించుకోవడం లేదు. చోరీ జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి.. ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును పక్కన పెడుతున్నారు. మరోవైపు పోలీసులు ప్రతిరోజూ బందోబస్తులు, మీటింగ్స్, పెండింగ్ కేసుల్లో కోర్టు విచారణకు వెళ్తుండడంతో చిన్నచిన్న నేరాల కేసుల్లో పురోగతి ఉండడం లేదు. గ్రామాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బాధితులు పోలీస్ స్టేషన్‌కి వెళ్లినా సరైన స్పందన లభించడం లేదు. దీంతో చోరీకి గురైన సొత్తు తిరిగి తమకు చేరుతుందనే నమ్మకాన్ని బాధితులు కోల్పోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది జరిగిన ప్రాపర్టీ నేరాలు
సంవత్సరం కేసులు ఛేదించినవి దొంగిలించిన సొమ్ము రికవరీ
2021 23,261 9,682 రూ.114.5 కోట్లు రూ.48.52 కోట్లు
2022 24,127 12,223 రూ.148 కోట్లు రూ.74 కోట్లు