వీడీసీలపై యాక్షన్​ షురూ .. 15 రోజుల్లోనే 39 మందిపై కేసులు

నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​, బాల్కొండ, నిజామాబాద్​ రూరల్​అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేళ్లూనుకున్న వీడీసీల అరాచకాలపై పోలీసులు ఫోకస్​పెట్టారు. రాజకీయ కారణాల వల్ల గత సర్కారు చూసీచూడనట్లు వ్యవహరించడంతో చాలాచోట్ల వీడీసీలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కల్లు డిపోలు, బెల్టుషాపులు, ఇసుక క్వారీలకు వేలం పాటలు, మాట విననివాళ్లకు జరిమానాలు, గ్రామ బహిష్కరణలు కామన్​ అయ్యాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో నిజామాబాద్​ సీపీ కల్మేశ్వర్ ​రంగంలోకి దిగారు. పోలీస్​స్టేషన్ల వారీగా పాత ఫైళ్లు తెప్పించుకొని దుమ్ము దులుపుతున్నారు. 15 రోజుల్లో ఏకంగా39 మందిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం హాట్​టాపిక్ ​అయ్యింది. 

మంచి కోసం మొదలై.. 

ఊళ్లలో అందరూ కలిసికట్టుగా ఉండేందుకు, ఊరుమ్మడి కార్యక్రమాలను జరుపుకునేందుకు ఏర్పాటయిన సర్వసమాజ్ కమిటీలు క్రమంగా ఊళ్ల మీద పెత్తనం చేసే వీడీసీలుగా మారాయి. నిజామాబాద్​తదితర జిల్లాల్లో ఈ కమిటీలు 25 ఏండ్లుగా పనిచేస్తున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో ప్రస్తుతం 154 గ్రామాభివృద్ధి కమిటీలున్నాయి. ఊళ్లలో కమిటీలు బలంగా ఉండడంతో పొలిటికల్ పార్టీలు కూడా వీడీసీలకు అండగా ఉంటున్నాయి. దీంతో వీరు చట్టాలను సవాల్​ చేసే స్థాయికి ఎదిగారు.  

గ్రామాలనే శాసిస్తున్నరు

ఉత్తర తెలంగాణలో దాదాపు 90 శాతం గ్రామాల్లో వీడీసీల పెత్తనం కొనసాగుతోంది. సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరైనా వీడీసీ నిర్ణయాలను కాదనే పరిస్థితులు లేవు. వీడీసీలు ఏకపక్షంగా కుల, గ్రామ బహిష్కరణ శిక్షలు వేస్తున్నాయి. ఊరి కట్టుబాటు అంటూ మాట వినని వారి మీద ఆంక్షలు విధిస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిర్ణయాల మీద కూడా వీడీసీల ప్రభావం ఉంటోంది. ఊళ్లో ఏ ఫండ్స్​తో ఏ పని జరగాలన్నా వీరి అనుమతి ఉండాల్సిందే. దీంతో చాలా చోట్ల సర్పంచులు డమ్మీలుగా మారారు. ఇసుక అక్రమ రవాణా, బెల్టుషాపులకు వీడీసీల ఆధ్వర్యంలోనే వేలం పాటలు నిర్వహిస్తున్నారు. దీని కోసం రూ.లక్షలు వసూలు చేస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇసుకను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. 

ఎక్కడంటే అక్కడ ఇష్టమొచ్చిన రేట్లకు లిక్కర్ అమ్ముతున్నారు. కల్లు సీసాల రేటు కూడా నిర్ణయిస్తున్నారు. కూల్​డ్రింక్, కోడిగుడ్ల వ్యాపారం చేసేవాళ్లు కూడా వీడీసీ వేలం పాటలో పాల్గొనవల్సిందే. ప్రశ్నిస్తే వేలు, లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. కట్టకపోతే ఒంటరి వాళ్లను చేసి మానసికంగా వేధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ వివాదాల్లో కూడా వీడీసీలు జోక్యం చేసుకొని తీర్పులిస్తున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడం, విలేజ్​ పోలీస్​ విధానం అమలు చేయకపోవడంవల్ల ఊళ్లలో ఏం జరుగుతుందో పోలీసులకు తెలియట్లేదు.  

40 కుటుంబాల బహిష్కరణ..

నిజామాబాద్​ రూరల్​ సెగ్మెంట్​లోని ధర్పల్లి మండలం దుబ్బాకలో సర్వే నంబర్​ 979లో భూమిలో 50 ఏండ్లుగా స్థానికులు కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ముగ్గురికి పట్టాలు కూడా ఉన్నాయి. ఆ పట్టాలు వదులుకొని భూమిని గ్రామానికి హ్యాండోవర్​ చేయాలనే వీడీసీ ఆదేశించింది. తమ జీవనాధారమే భూమి అని, ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని పట్టాదారులు తేల్చిచెప్పారు. దీంతో వారి సామాజిక వర్గానికి చెందిన సుమారు 40 కుటుంబాలను బహిష్కరిస్తున్నట్లు వీడీసీ ప్రకటించింది. వారి దుకాణాలకు గ్రామంలో ఎవరూ వెళ్లొద్దని

ఎలాంటి సహాయం చేయొద్దని హుకుం జారీ చేసింది. ఇంతటి శిక్ష వద్దని పట్టాదారులు వీడీసీకి మొరపెట్టుకోగా, మాట విననందుకు ముగ్గురూ అదనంగా రూ.50 వేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది. బాధితులు సీపీ కల్మేశ్వర్​ను కలువగా ఈనెల 21న వీడీసీకి చెందిన ఐదుగురిపై నాన్​బెయిలబుల్​ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు పంపారు.  

అత్తగారి భూమి దున్నుకున్నాడని ..

బాల్కొండ నియోజకవర్గంలోని షెట్​పల్లిలో తమ అనుమతి లేకుండా అత్తగారి పట్టా భూమిని దున్నుకున్నాడంటూ ఓ ఇంటి అల్లుడిపై వీడీసీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. బాధితుడు పోలీసుల వద్దకు వెళ్లగా ఈనెల15న వీడీసీలోని ఏడుగురిని రిమాండ్​కు పంపారు. మరోవైపు వేల్పూర్ ​మండలం అమీనాపూర్​లో వీడీసీ మీటింగ్​ జరుగుతుండగా ఒకరు ఫొటో తీశారని, దళిత సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలను బహిష్కరించారు.  పోలీసుల దృష్టికి వెళ్లగా ఈనెల 21న 24 మంది వీడీసీ సభ్యులపై కేసులు పెట్టి తొమ్మిది మందిని రిమాండ్​కు పంపారు. 

పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నారు. ఆర్మూర్ ​నియోజవర్గంలోని నందిపేట మండలం షాపూర్​ గ్రామానికి చెందిన నడ్పి గంగాధర్ ​బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లేటప్పుడు తన వ్యవసాయ బోరు నీటిని మరొకరు వాడుకునేందుకు అంగీకరించాడు.  దీంతో వీడీసీ అతడికి  రూ. 4 లక్షల జరిమానా విధించింది. పోలీసులకు  తెలియడంతో మంగళవారం ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

నాలుగేండ్ల నుంచి అమల్లో బహిష్కరణ

బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ ​మండలం కొత్తపల్లిలో భూవివాద విషయంలో ఒక సామాజిక వర్గంపై నాలుగేండ్ల కింద వీడీసీ గ్రామ బహిష్కరణ విధించారు. ఇప్పటికీ వారి కుటుంబాలకు చాకలి, మంగళి కులాల వారు సహకరించట్లేదు. ఎవరైనా చనిపోతే కనీసం చావు డప్పు కొట్టడానికి కూడా ఎవరూ వెళ్లట్లేదు. బహిష్కరణ ఎదుర్కొంటున్న వారి ఇండ్లలో గ్రామస్తులెవరూ కిరాయికి ఉండొద్దనడంతో ఎవరూ రావడం లేదు. వీడీసీ శిక్షలను ఇన్నాళ్లు మౌనంగా భరించిన బాధితులు ఇప్పుడు పోలీస్​స్టేషన్ల గడప తొక్కుతున్నారు. పోలీసులు కూడా  స్పందించి కేసులు నమోదు చేస్తుండడంతో వీడీసీల పెత్తనం అంతమవుతుందని ఆశిస్తున్నారు.  

ఒకే భూమిలో పోటాపోటీ సాగు

ముప్కాల్​మండలం నాగంపేటలో వీడీసీ సభ్యుల మధ్య ఇనామ్​భూమి పంచాయితీ నడుస్తోంది. రెండు గ్రూపులుగా విడిపోయిన ఇక్కడ వీడీసీ సభ్యులు వివాదాస్పద భూమిలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్​లో ఒక వర్గం..యాసంగిలో మరో వర్గం పంటలు వేసుకున్నారు. ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉండడంతో డిసెంబర్18న జిల్లా ఇన్​చార్జ్​కమిషనర్​జయరాం వెళ్లి ఇరువర్గాలకు వార్నింగ్​ఇచ్చారు. వివాదాన్ని రెవెన్యూ ఆఫీసర్లకు రిఫర్​చేశారు.