వరంగల్​ ట్రాఫిక్ కంట్రోల్ పై పోలీసుల ఫోకస్

  •    గ్రేటర్ వరంగల్​లో పెరుగుతున్న వాహనాల రద్దీ
  •     ఈ‌‌ ట్రాఫిక్ చిక్కులు తలెత్తుతుండటంతో పోలీసుల యాక్షన్
  •     నగరంలో ఏడు చోట్ల పార్కింగ్ ప్లేసులు
  •     కొత్తగా 10 జంక్షన్లలో సిగ్నలింగ్ వ్యవస్థ
  •     సెల్లార్లు, ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించేందుకు కసరత్తు

హనుమకొండ, వెలుగు : వరంగల్​ ట్రై సిటీలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతోంది. పండుగల టైంలో ట్రాఫిక్​ మరీ ఎక్కువవుతోంది. కానీ సిటీలో రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్లేసులు, రష్​ ఎక్కువగా ఉండే జంక్షన్లలో సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ట్రాఫిక్​ కష్టాలకు ఫుల్​ స్టాప్​ పెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. జంక్షన్లలో సిగ్నలింగ్​ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్​ ప్లేసులు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

సెల్లార్లు, ఫుట్​ పాత్​ ఆక్రమణలపై నజర్

వరంగల్ నగర రోడ్లపై నిత్యం లక్షకు పైగా వాహనాలు రాకపోకలున్నట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. వివిధ అవసరాల కోసం లక్షలాది మంది నగరానికి వస్తుండగా.. సిటీలో బండ్లు పార్క్​ చేసేందుకు అనువైన ప్రదేశాలు మాత్రం లేవు. ఓ వైపు పార్కింగ్​ ప్లేసులు లేక, మరోవైపు కమర్షియల్​ కాంప్లెక్స్​లలో సెల్లార్లను వినియోగించుకోలేని పరిస్థితి ఉండటంతో వరంగల్, హనుమకొండలోని బిజినెస్ అడ్డాలు, ఆసుపత్రుల వద్ద బండ్లన్నీ రోడ్లపైనే ఉంటున్నాయి. 
వరంగల్ ట్రై సిటీలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఏడు ప్రాంతాల్లో పార్కింగ్​ ప్లేసులు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. 

సిటీలో ఫుట్​పాత్​ ఆక్రమణలు 

సిటీలో ఫుట్​ పాత్​లు దాదాపు 90 శాతం ఆక్రమణల చెరలోనే ఉండగా, రోడ్ల వెంట హోటల్స్​, ఆసుపత్రులు, షాపింగ్​ మాల్స్​, వివిధ కాంప్లెక్సుల నిర్వాహకులు ఫుట్​ పాత్​ లను కూడా వాడుతున్నారు. దీంతో పాదచారులు కూడా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా జనాలు కూడా మెయిన్​ రోడ్లపైనే నడుస్తుండటంతో ట్రాఫిక్​ చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. ఈ ఫుట్​ పాత్​ ఆక్రమణలు తొలగించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అలాగే సెల్లార్లను పార్కింగ్​ కోసం కాకుండా ఇతర అవసరాలకు వినియోగించేవారిపై దృష్టి పెడుతున్నారు. 

కొత్త జంక్షన్లలో సిగ్నల్స్​

గ్రేటర్ సిటీలో వెహికిల్స్​ ను కంట్రోల్ చేయడానికి జంక్షన్​ల అభివృద్ధి, సిగ్నలింగ్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్​ సిద్ధం చేశారు. పది జంక్షన్లలో పని చేయని పాత సిగ్నల్స్​ మార్చడంతో పాటు రద్దీ ఎక్కువగా ఉంటున్న మరో 10 జంక్షన్లలో కొత్తగా సిగ్నల్స్​ ఏర్పాటు చేయనున్నారు. రెండు రోజుల కిందట రోడ్డు సేఫ్టీ మీటింగ్​ నిర్వహించిన వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ ఝా, గ్రేటర్​ కమిషనర్​ అశ్వినీ తానాజీ వాకడే, హనుమకొండ కలెక్టర్​ పి.ప్రావీణ్య, ట్రాఫిక్​ ఏసీపీ సత్యనారాయణ నగరంలో పార్కింగ్​ ప్లేసులు, కొత్తగా సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను విజిట్​ చేశారు. 

పార్కింగ్​ ప్లేసులు ఏర్పాటు చేయబోయే ప్రాంతాలు

  •     వరంగల్ రైల్వే స్టేషన్​, వరంగల్ హెడ్​ పోస్టాఫీస్, వరంగల్ చౌరస్తా, హనుమకొండ చౌరస్తా, అశోక జంక్షన్​, అదాలత్​ జంక్షన్​, కాజీపేట చౌరస్తా

కొత్తగా సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్న జంక్షన్లు

  •     మడికొండ, వడ్డేపల్లి చర్చి​, పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మగడ్డ జంక్షన్​, న్యూ శాయంపేట, తెలంగాణ జంక్షన్​, వరంగల్ ఆర్టీఏ ఆఫీస్​, మర్కజీ స్కూల్​ జంక్షన్​, కేఎల్ఎన్​ రెడ్డి కాలనీ జంక్షన్​, కిట్స్​ కాలేజీ క్రాస్​ రోడ్డు.

ట్రాఫిక్​ కంట్రోల్​తో పాటు ప్రమాదాల నివారణ

వరంగల్ నగరంలో ట్రాఫిక్​ కంట్రోల్​ తో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. రెండు, మూడు రోజుల్లో ఫుట్​ పాత్​ ఆక్రమణలు, సెల్లార్ల వినియోగంపై జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్ల సమన్వయంతో చర్యలు తీసుకుంటాం. కొత్త జంక్షన్లలో సిగ్నల్స్​ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ ప్లేసులు అందుబాటులోకి తీసుకొచ్చి వాహనాల రాకపోకల విషయంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతాం.

- సత్యనారాయణ, వరంగల్ ట్రాఫిక్​ ఏసీపీ