- రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై పోలీస్ ఫోకస్
- యూటర్న్, వన్ వే, నో ఎంట్రీల వద్దనే ఎక్కువ ప్రమాదాలు
- గ్రేటర్‌లో 9 నెలల్లో 5.5లక్షలకుపైగా కేసులు
హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లపై ప్రమాదాలకు కారణమతున్న రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది 9 నెలల్లో రాంగ్‌రూట్ డ్రైవింగ్ కారణంగా 51 మంది చనిపోయారు. మరో 360 మంది గాయాలపాలయ్యారు. వీటిని నివారించేందుకు పోలీసులు నిరంతర నిఘా పెట్టారు. రాంగ్ రూట్లో వచ్చిన వాళ్లను గుర్తించి, జరిమానాలతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 9 నెలల్లోనే 5,79,815 కేసులు ఫైల్ చేశారు.
షార్ట్ కట్ కోసం రాంగ్‌రూట్, ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవ్
రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ‘యూ టర్న్స్’ వద్దనే జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కొందరు యూటర్న్ తీసుకునేందుకు దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని షార్ట్ కట్‌లో ప్రయాణిస్తున్నారు. సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ షార్ట్ కట్ కోసం ఆపోజిట్ డైరెక్షన్ల లో వెళ్తున్నారు. ఇలాంటి డ్రైవింగ్ వల్ల ట్రాఫిక్ రూల్స్ పాటించే వారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ ప్రాంతాల్లో అధికం..
హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 61 ప్రాంతాల్లో రాంగ్‌రూట్‌డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ప్రాంతాల్లో వన్ వే, సిగ్నల్స్, యూటర్న్స్, ఫ్లై ఓవర్స్ కింద, నో ఎంట్రీ రూట్‌లో ఎక్కువగా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్,అండర్ పాస్,ఫ్లై ఓవర్స్ సహా ఎక్కువ దూరం యూ టర్న్స్ ఉన్న రోడ్లపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేషనల్ హైవేస్ ఎక్కువగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోని సర్విస్ రోడ్స్,ఫ్లై ఓవర్స్,సిగ్నల్ టైమింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తున్నారు.
సీసీ కెమెరాలతో నిఘా..
రద్దీ ప్రాంతాల్లో ‘ఆటోమేటిక్ రాంగ్ డైరెక్షన్ వాయిలేషన్ క్యాప్చర్ సిస్టం’ (ఏఆర్‌డీవీసీఎస్)తో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా క్యాప్చర్ చేస్తున్నారు. సిటీ రోడ్లపై ఇప్పటికే108 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు రాంగ్ రూట్లో వెళ్లే వెహికల్స్‌ను గుర్తించి, కమాండ్ కంట్రోల్ రూమ్ లో వెహికిల్ నంబర్‌తో పాటు ఫొటో క్యాప్చర్ చేస్తాయి. వీటి ద్వారా పోలీసులు ఈ-చలాన్, కేసులు ఫైల్ చేస్తున్నారు.
రాంగ్రూట్తో ప్రాణహాని
రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ రద్ధీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, యూటర్న్స్ వద్ద రాంగ్ రూట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. మా కమిషనరేట్ పరిధిలో 61 ప్రాంతాలను గుర్తించాం. స్థానిక పోలీసులు వారంలో రెండు రోజుల పాటు చెక్ చేస్తున్నారు. ప్రాణహాని కలుగుతుంది కాబట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. కోర్టులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేస్తున్నాము.
విశ్వప్రసాద్, అడిషనల్ సీపీ, ట్రాఫిక్,హైదరాబాద్
గ్రేటర్‌లో నమోదైన రాంగ్‌రూట్ డ్రైవింగ్ కేసులు (సెప్టెంబర్ 27 వరకు)
కమిషనరేట్ మొత్తం కేసుల సంఖ్య
హైదరాబాద్ 3,30,354
సైబరాబాద్ 1,62,578
రాచకొండ 86,883
మొత్తం 5,79,815