
- పార్టీ కార్యకర్తలపై పోలీస్ నిఘా
- గ్రేటర్‌లో 13 కేసులు నమోదు
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో న్యూసెన్స్ చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ర్యాలీలు, బహిరంగ సభల్లో ఇతర పార్టీల అభ్యర్ధులు, కార్యకర్తలను రెచ్చగొడుతూ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గ్రేటర్‌లో వారం రోజుల వ్యవధిలోనే 13 కేసులు రిజిస్టర్ చేశారు. బాధితులు, ప్రత్యర్ధుల ఫిర్యాదులతో ఎఫ్‌ఐఆర్‌లు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఆధారంగా సుమోటో కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలక్షన్ కోడ్ బ్రేక్ చేస్తున్న అభ్యర్ధులపై పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు.
ఓల్డ్ సిటీ పైనే స్పెషల్ ఫోకస్
ప్రధానంగా ఓల్డ్‌సిటీ పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారాల్లో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిని గుర్తిస్తున్నారు. గత ఎన్నికల్లో పెటీ కేసు నిందితులు, పబ్లిక్ న్యూసెన్స్ చేసి గొడవలు చేసిన వారి వివరాలు సేకరించారు. దీంతో పాటు రౌడీ షీటర్లను ఇప్పటికే బైండోవర్ చేశారు. లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
రౌడీ షీటర్ల ముందస్తు బైండోవర్
ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. సాధారణంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఐపీసీ 107,108,109,110 సెక్షన్ల కింద బైండోవర్ కేసులు నమోదు చేస్తారు.
ఇందులో రూల్స్ ప్రకారం ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడే వ్యక్తులను స్థానిక ఎమ్మార్వో లేదా ఆర్డీవోల ముందు ప్రవేశపెట్టి బాండ్ పేపర్స్‌పై రాత పూర్వక హామీ తీసుకుంటారు.ఇలా బైండోవర్ కేసులు నమోదైన వారు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా 24 గంటల్లో అరెస్ట్ చేసే అధికారం స్థానిక పోలీసులకు ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్ చేశారు.