జాతీయ జెండా ఎగురవేసి.. ఫారెస్ట్ ల్యాండ్ ​కబ్జాకు యత్నం

జాతీయ జెండా ఎగురవేసి.. ఫారెస్ట్ ల్యాండ్ ​కబ్జాకు యత్నం
  • 150 మందిని అదుపులోకి తీసుకున్న వనస్థలిపురం పోలీసులు

ఎల్బీనగర్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి ఫారెస్ట్ ల్యాండ్​కబ్జాకు యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్ మన్సూరాబాద్​లోని సర్వే నంబర్ 7లో 580 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఈ భూమి తమ తల్లిదని నమ్మించి యూసఫ్ ఖాన్ దంపతులు సుమారు 50 వేల మందికి డాక్యుమెంట్లు అమ్మేశారు. ఇందుకు సంబంధించి హైకోర్టులో ఇప్పటివరకు 280 రిట్ పిటిషన్స్ వేయగా, వాటన్నింటినీ కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలోనే ఈ ల్యాండ్​పై డాక్యుమెంట్ దారులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని హైకోర్టులో ఈ కేసును వాదిస్తున్న జిలాని పిలుపునిచ్చారు. 

జాతీయ జెండా ఎగురవేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుందామని చెప్పి, అతడు మాత్రం రాకుండా జనాన్ని ఉసిగొల్పాడు. దీంతో ఆదివారం హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఫారెస్ట్ ల్యాండ్ వద్దకు దాదాపు 4-–5 వందల మంది వచ్చారు. దీనిపై ఫారెస్ట్ అధికారుల సమాచారం ఇవ్వడంతో వనస్థలిపురం పోలీసులు అక్కడికి చేరుకొని కబ్జాకు యత్నించిన వారిలో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ ఆఫీసర్లు మాట్లాడుతూ.. ఫారెస్ట్ ల్యాండ్​కబ్జాకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.