కర్రెగుట్టపై జాతీయ జెండా ఎగురవేసిన భద్రతా బలగాలు

కర్రెగుట్టపై జాతీయ జెండా ఎగురవేసిన భద్రతా బలగాలు
  • త్వరలోనే  బేస్​క్యాంపు ఏర్పాటుకు నిర్ణయం 
  • పాత టీమ్ రిటర్న్.. రంగంలోకి కొత్త బలగాలు 
  • రాయపూర్​ను నేరుగా పర్యవేక్షించిన ఐబీ చీఫ్​

హైదరాబాద్:  తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలోని  కర్రెగుట్టల్లో  మావోయిస్టు నేతలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన  ఆపరేషన్​ఇవాళ్టికి 9వ రోజుకు చేరుకుంది.  ఈ ఆపరేషన్‌లో భాగంగా కర్రెగుట్టలను భద్రతాబలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.   కర్రెగుట్టపై పూర్తి పట్టును సాధించడంతో ఆపరేషన్​కగార్​ సక్సెస్​అయింది.  10 వేలకు పైగా సాయుధ బలగాలలు ఈ ఆపరేషన్​లో పాల్గొన్నాయి.   5 వేల అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల్లో శిఖరం వరకు చేరుకున్న బలగాలు ఇవాళ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ కనిపించాయి.  

సీఆర్‌పీఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దులోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేరు, నంబి, గల్‌గం, నడిపల్లి ల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడుతున్నాయి.  ఈ ఆపరేషన్​నేరుగా ఐబీ చీఫ్​రాయపూర్​నుంచి పర్యవేక్షించారు. ఇప్పటికే కర్రెగుట్టను పోలీసు భద్రతా బలగాలు  అష్టదిగ్బంధనం చేసి ఆ ఏరియాల్లో మావోయిస్టులు అమర్చిన 150కు పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి.   ఈ ఆపరేషన్​లో పాత టీమ్​ను వెనక్కి రప్పించి.. రంగంలోకి కొత్త టీమ్​ను పంపిస్తున్నారు.  

►ALSO READ | బరితెగించిన పాక్ సోషల్​ మీడియా.. లెఫ్టినెంట్​ జనరల్​ను తొలగించారంటూ తప్పుడు వార్తలు

త్వరలోనే గుట్టలపై సీఆర్ పీఎఫ్​ బేస్​క్యాంపును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఆ ఏరియాల్లో హెలికాఫ్టర్​, డ్రోన్స్​లతో సెర్చ్​ఆపరేషన్​ చేశారు.   మావోయిస్టుల రహస్య ప్రాంతాలు, సొరంగ మార్గాలు, డంప్​లను గుర్తించారు.  మరోవైపు కర్రెగుట్ట ఆపరేషన్ జరుగుతున్న  క్రమంలోనే శాంతి చర్చలు జరపాలని కోరుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు.