బాలుడిపై లైంగిక దాడికి యత్నం..నిందితుడు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు : ఏడేండ్ల బాలుడిపై లైంగిక దాడికి యత్నించిన పండ్ల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్​కు చెందిన దంపతులు మూడు నెలల కిందట సిటీకి వచ్చారు. వీరికి ఏడేండ్ల కొడుకు ఉండగా, కూకట్​పల్లిలోని సప్తగిరికాలనీలో నివాసం ఉంటున్నారు. కర్నాటకలోని బీదర్​కు చెందిన సైలాన్​బాబా(28) తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు. తోపుడు బండి మీద పండ్ల వ్యాపారం చేస్తున్న నిందితుడు.. ప్రతి రోజు సప్తగిరికాలనీలో బాలుడు తల్లిదండ్రులు ఉంటున్న బిల్డింగ్​సమీపంలో బండిని పెడుతున్నాడు. 

బాలుడి మీద కన్నేసి, రోజూ ఏదో ఒక పండు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. ఈ నెల 15న మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిని బాత్​రూమ్​లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితుడు కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న బాలుడి బాబాయ్​ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. దీంతో డోర్ తీసిన నిందితుడు కత్తితో బెదిరించి పరారయ్యాడు. అప్పటి నుంచి బాలుడి తల్లిదండ్రులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

మంగళవారం రాత్రి సప్తగిరికాలనీలో కూరగాయల మార్కెట్​జరగగా, పండ్ల బండి పెట్టిన నిందితుడిని బాలుడి సహాయంతో స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దీంతో పోక్సో చట్టం కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.