- ఇటీవల బాంబు కొరకడంతో చనిపోయిన గేదె
- నిఘా పెట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోనరావుపేట, వెలుగు : నాటుబాంబులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెంకటేశ్వర్లు ఆదివారం కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ముడికె మల్లేశం గేదె ఇటీవల ఓ నాటు బాంబును కొరడంతో దాని దవడ పగిలి చనిపోయింది. బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ధర్మారం గ్రామానికి చెందిన, గతంలో నాటుబాంబులు తయారుచేసి పట్టుబడిన పిట్టల రాజలింగంపై పోలీసులు నిఘా పెట్టారు.
ఆదివారం అతడు నాటు బాంబులు అమ్ముతున్నాడని సమాచారం అందడంతో ఏఎస్సై రఘుపతిరెడ్డి సిబ్బందితో కలిసి రాజలింగం ఇంటిపై దాడి చేశారు. ఈ టైంలో చిన్న బోనాలకు చెందిన పడిగె లస్మయ్య, తుమ్మల కనకరాజుకు బాంబులు అమ్ముతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. రాజలింగం వద్ద ఏడు నాటు బాంబులు, రూ.2 వేలు, గన్ పౌడర్, లస్మయ్య వద్ద, కనకరాజు వద్ద 10 చొప్పున నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
నాటు బాంబుల తయారీ ముఠాను పట్టుకున్న రుద్రంగి ఎస్సై అశోక్, కిరణ్ కుమార్, ఏఎస్సై రఘుపతిరెడ్డి, సిబ్బందిని సీఐ అభినందించారు. మరో వైపు ధర్మారంలో గేదె చనిపోయిన ఘటనకు సంబంధించి సర్దాపూర్ గ్రామానికి చెందిన మొగిలి అంజయ్యను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద 40 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.