- పరారీలో మరో ఇద్దరు నిందితులు
అమ్రాబాద్, వెలుగు: వన్యప్రాణి అలుగు(పాంగోలిన్) స్మగ్లింగ్ కేసులో 11 మంది అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా డీఎఫ్ఓ రోహిత్ తెలిపారు. మంగళవారం ఫారెస్ట్ చింకారా హాల్ లో ప్రెస్ మీట్ లో ఆయన నిందితులను, స్మగ్లింగ్ చేసిన అలుగును ప్రదర్శించి మాట్లాడారు. ఆదివారం హాజీపూర్ వద్ద అలుగు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లు గస్తీ పెట్టారు. సోమవారం ఉదయం నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారించగా పలు విషయాలు తెలిశాయి. జడ్చర్లకు చెందిన గజ్జి బాలరాజు వన్యప్రాణులు, రైస్ పుల్లింగ్, గుప్త నిధుల వేట వంటి అక్రమాలకు పాల్పడుతుంటాడు.
అతని సూచనతో ఈనెల5న నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన శీలం బుడ్డయ్య, శీలం అంజయ్య, ఉడుతల వెంకటేశ్, నిమ్మల భాను ప్రసాద్, జెళ్ల బయ్యన్న అనే చెంచుల ద్వారా అలుగు వేటకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా రూ. 20 వేలు అడ్వాన్స్ గా ఇచ్చారు. దీంతో చెంచుల బుడ్డయ్య నేతృత్వంలో చుక్కల గుండం ఏరియాలో నాలుగు రోజులు కాపుకాసి అలుగును పట్టుకున్నారు. దాన్ని అమ్మేందుకు మండ్లి వీరయ్య, చిగుర్ల అంజయ్య, శీలం ఈదయ్య యత్నించారు. బాలరాజుకు తోడుగా పురం సాయి కుమార్, గౌతమ్, కళామండలి రమేశ్, వడ్డే లక్ష్మి వెళ్లారు.
ఇటీవల రంగారెడ్డి జిల్లాలోనూ మరో అలుగు అమ్మకానికి యత్నించినట్టు తెలియగా నందు అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరో రెండు అలుగులను కూడా మహబూబ్ నగర్ లో అమ్మినట్లు తెలిసింది. స్థానిక చెంచులకు డబ్బు ఆశ చూపి అక్రమంగా వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్నారి, పరారీలో ఉన్న చిగుర్ల అంజయ్య, కోనాపూర్ రమేశ్కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పారు. అమ్రాబాద్, అచ్చంపేట, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్డీఓలు రామ్మూర్తి, తిరుమలరావు, రామ్మోహన్, రేంజర్లు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.