- నిందితుడి అరెస్ట్
- 10 తులాల బంగారం, కిలో వెండి నగల స్వాధీనం
యాదగిరిగుట్ట, వెలుగు: దేవాలయాలు, తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. యాదగిరిగుట్ట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏసీపీ కోలను శివరాంరెడ్డి, గుట్ట రూరల్ సీఐ సురేందర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన యాట రమేశ్ కొన్నేండ్లుగా దేవాలయాలు, తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆదివారం పొద్దున రాజాపేట మండలం పాముకుంట చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా చూసి రమేశ్ టీవీఎస్ ఎక్సెల్‌పై పారిపోతుండగా పట్టుకున్నారు.
హ్యాండ్ బ్యాగ్ లో చెక్ చేయగా.. బంగారం, వెండి దొరికింది. అదుపులోకి తీసుకుని విచారించగా 13 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి 10 తులాల బంగారం, కిలో వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్‌ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించామని ఏసీపీ తెలిపారు. కాగా నిందితుడు రమేశ్‌పై గతంలో కూడా 19 కేసులు ఉన్నాయని, 2018 నుంచి 2020 వరకు జైలుశిక్ష అనుభవించాడని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న రాజాపేట ఎస్ఐ సుధాకర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లను ఏసీపీ శివరాంరెడ్డి అభినందించారు.