- మరొకరిపై హత్యాయత్నం
- నిందితుడిని అరెస్ట్ చేసిన మోండా మార్కెట్ పోలీసులు
సికింద్రాబాద్, వెలుగు: పైసల కోసం ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తిని హత్య చేయడంతో పాటు మరో వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన నిందితుడిని మోండా మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సోమవారంనార్త్ జోన్ అడిషనల్ డీసీపీ మధుసూదన్ రావు మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ రోడ్ సారంగాపూర్ కు చెందిన మహ్మద్ మొహసిన్(25) పాత నేరస్తుడు.
మూడేండ్ల కిందట సిటీకి వచ్చి కూలీ పనిచేసుకుంటూ గాంధీ ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్ పై ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొహసిన్కు కూలీ పనితో వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఫుట్ పాత్ పై పడుకునే వారిని, ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసేవాడు. బెదిరించి, దాడి చేసి డబ్బులు తీసుకునేవాడు. గత నెల 29న సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ పార్కింగ్ గేటు ముందు ఉన్న ఫుట్ పాత్ పై పడుకున్న ఓ వ్యక్తిని డబ్బుల కోసం మొహసిన్ బెదిరించాడు. ఆ వ్యక్తి వద్ద ఉన్న పైసలను లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోవడంతో మొహసిన్ అతడిపై బ్లేడ్ తో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత బిహార్ కు చెందిన మిథిలేష్ కుమార్ యాదవ్ జూబ్లీ బస్ స్టేషన్ వైపు ఒంటరిగా వస్తుండగా.. మొహసిన్ అతడిని అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని దాడికి దిగాడు. అడ్డుకోబోయిన మిథిలేష్ పై సైతం బ్లేడ్ తో దాడి చేసి అతడి జేబులో ఉన్న రూ.800ను తీసుకొని మొహసిన్ పారిపోయాడు. ఈ ఘటనలో యశోద ఆస్పత్రి ఫుట్ పాత్ వద్ద తీవ్రంగా వ్యక్తిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరుసటి రోజు ఆ వ్యక్తి మృతి చెందాడు. మోండా మార్కెట్ పోలీసులు కేసు ఫైల్ చే సి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేట్టారు. అయితే, మొహసిన్ చేతిలో గాయపడ్డ మిథిలేష్ సైతం గాంధీలో ట్రీట్ మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయిన తర్వాత తనపై జరిగిన దాడిపై మోండా మార్కెట్ పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. తనపై దాడి చేసిన వ్యక్తే ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తిని హత్య చేసిన ఉంటాడని మిథిలేష్ అనుమానం వ్యక్తం చేశాడు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన మోండా మార్కెట్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. మొహిసిన్ హత్య చేసినట్లు గుర్తించారు. నిజామాబాద్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సెల్ ఫోన్, బ్లేడ్ ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : యాదవ భవన కూల్చివేతపై ఉద్రిక్తత .. కార్వాన్లో ఆందోళన