- నిందితుల్లో నైజీరియన్, మధ్యప్రదేశ్‌కు చెందిన అన్నదమ్ములు
- అరెస్ట్ చేసిన నార్కోటిక్ వింగ్, సిటీ పోలీసులు
- 256 గ్రాముల వివిధ రకాల డ్రగ్స్ స్వాధీనం
- హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
బషీర్ బాగ్, వెలుగు: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, సిటీ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో ఆరు రకాల డ్రగ్స్ ను అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.కోటి 10 లక్షల విలువ చేసే 256 గ్రాముల వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో నైజీరియన్, ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్ తో పాటు డ్రగ్ డెలివరీ బాయ్ ఉన్నారు. బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ఓల్డ్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నైజీరియన్ అఫోజార్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్ (42) బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉండే భోపాల్ కి చెందిన డ్రగ్ పెడ్లర్ అనాస్ ఖాన్ (31), డెలివరీ బాయ్ సైఫ్ ఖాన్ (27) వాటిని ఇక్కడ విక్రయిస్తుంటారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వీరు ముగ్గురు మంగళవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారులో కూర్చొని కస్టమర్ కోసం వెయిట్ చేస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి వద్ద నుంచి 36 గ్రాముల కొకైన్, 140 గ్రాముల ఎండీఎంఏ, 9 ఎక్స్టాసి పిల్స్, 6 ఎల్ఎస్డీ బ్లాట్స్, 32 గ్రాముల చరస్, 41 గ్రాముల ఎంఈఓడబ్ల్యూ ఇలా మొత్తం ఆరు రకాల డ్రగ్స్ తో పాటు కారు, 5 మొబైల్స్, రూ.2,260 నగదు సీజ్ స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నట్టు సీపీ తెలిపారు.
వీరిలో అనాస్ ఖాన్, సైఫ్ ఖాన్ లు వరుసకు అన్నదమ్ములని, నైజిరియన్ నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణలో తేలిందని సీపీ తెలిపారు. నైజీరియన్ ఫ్రాంక్స్పోర్ట్స్ వీసాపై ఇండియాకు వచ్చి కొన్ని రోజులు ఢిల్లీ, బెంగళూరులోని స్పోర్ట్స్క్లబ్లలో ఫుట్బాల్ఆడాడని చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కస్టమర్ల వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
సిటీలో మొబైల్ స్నాచింగ్ లు తగ్గాయి
హైదరాబాద్ సిటీలో 90% మొబైల్ స్నాచింగ్ లు తగ్గుముఖం పట్టాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సిటీలో నిరంతర డేకాయ్ ఆపరేషన్లతో స్నాచింగ్ ముఠా మూలాలను ఛేదించామన్నారు. ఇక్కడ స్నాచింగ్ చేసి శ్రీలంక, సూడాన్ దేశాలకు మొబైల్స్ ను పంపిస్తున్నట్టు గుర్తించామన్నారు. మొబైల్ దొంగతనం చేస్తూ నిందితులు గుడిమల్కాపూర్ లో ఓ వ్యక్తిని హత్య చేశారని, దాంతో ఈ ముఠాల పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్ట బందోబస్తు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాంతియుతంగా వేడుకలు జరిగేలా 4 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉంటారన్నారు. రేపు గురువారం ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు గోల్కొండ కోటలో ప్రభుత్వం తరన అధికారిక వేడుకలు జరగనున్నాయని... ఆ పరిసరాల్లో నాలుగు అంచెల భద్రత ఉంటుందన్నారు.