రాహుల్సింగ్ కేసుకు ప్రేమ వ్యవహారంతో సంబంధం లేదు.. వ్యక్తిగత కక్షలే ప్రాణం తీశాయి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఆగస్ట 29వ తేదీన జరిగిన జిమ్ ట్రైనర్ రాహుల్ సింగ్ హత్య కేసును పోలీసులు వేగవంతం చేశారు. కేసు విచారణలో కొత్త కొత్త ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. రాహుల్ సింగ్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు తెరపైకి వచ్చాయి. రాహుల్ మర్డర్ కి ప్రేమ వ్యవహారం సంబంధం లేదని పోలీసులు నిర్ధించారు. వ్యక్తిగత కక్షలతోనే రాహుల్ ను నలుగురు వ్యక్తులు చంపారని గుర్తించారు. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్క ప్లాన్ ప్రకారం పెప్పర్ స్ప్రే చేసి రాహుల్ ను హత్య చేసి, ఎస్కేప్ అయ్యారని విచారణలో తేలింది. 

పుప్పాలగూడలోని అలీజాపూర్ ప్రాంతానికి చెందిన రాహుల్ సింగ్ (26) ప్రతిరోజు అత్తాపూర్ లోని సెలబ్రిటీ జిమ్ కు వెళ్లేవాడు. ఆగస్టు 29వ తేదీ సాయంత్రం జిమ్ కు వెళ్లిన రాహుల్ సెల్లార్ లో బైక్ పార్కింగ్ చేశాడు. అప్పటికే సెల్లార్ లో ఉన్న నలుగురు వ్యక్తులు.. రాహుల్ పై పెప్పర్ స్ప్రే కొట్టారు. పిడిగుద్దులతో అతడిపై దాడి చేస్తూ కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ రాహుల్ ను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అయితే.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. 

రాహుల్ పై దాడికి సంబంధించిన దృశ్యాలు సెల్లార్ లోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఈ కేసుకు రాహుల్ ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. కానీ, విచారణలో అసలు విషయం తెలిసింది. రాహుల్ హత్యకు ప్రేమ వ్యవహారం కాదని నిర్ధారించారు. నలుగురు వ్యక్తులు వ్యక్తిగత కక్షలతోనే చంపేశారని గుర్తించారు.