సంతానం కలిగేలా చేస్తామని రూ.3 లక్షలతో జంప్

సంతానం కలిగేలా చేస్తామని రూ.3 లక్షలతో జంప్
  • నలుగురు నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు

ఇచ్చోడ, వెలుగు: సంతానం కలిగేలా చేస్తామని, డబ్బులు రెట్టింపు చేస్తామని గిరిజనులకు మాయమాటలు చెప్పి రూ.3 లక్షలతో పరారైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ నాగేందర్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్​లో వెల్లడించారు. మధ్యప్రదేశ్​కు చెందిన పర్మల్ గౌండ్, కువర్ దేవి గౌండ్, రాంవీర్ గౌండ్, సలాం సింగ్ గౌండ్ ఇచ్చోడలో డేరాలు వేసుకొని ఉంటూ పరిసర పల్లెల్లో తిరుగుతూ చీరలు అమ్ముతుంటారు. 

ఈ నెల 19న సిరికొండ మండలం రాజంపేటకు చెందిన పెందూర్ జంగు ఇంటికి వెళ్లి వారితో ఆ కుటుంబసభ్యులతో మాటలు కలిపారు. తమకు సంతానం లేదని, ఆర్థిక ఇబ్బందులున్నాయని జంగు వారితో వాపోయాడు. తమకు తెలిసిన ఓ సిద్ధాంతి ఉన్నాడని, రూ.3 లక్షలు ఇస్తే సంతానం కలిగేలా మందులు ఇస్తాడని, మంత్రాలు చేస్తారని చెప్పారు. డబ్బులను రెట్టింపు చేస్తాడని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన జంగు దంపతులు రూ.3 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. డబ్బులతో మరుసటి రోజు ఇచ్చోడలోని ఆదిలాబాద్ బైపాస్ వద్దకు రమ్మనగా వెళ్లారు. ముగ్గురు కారులో, మరొకరు బైక్​పై వచ్చిన నిందితులు ఆ డబ్బులను తీసుకొని కొన్ని రసాయనాలు ఇచ్చి జారుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితులు ఈ నెల 21న సిరికొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని సిరికొండలోని పొన్నా ఎక్స్​రోడ్ వద్ద, మరో ఇద్దరిని ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల 10 వేలు, ఓ కారు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఇచ్చోడ, సిరికొండ ఎస్సైలు శ్రీకాంత్, నరేశ్, సీఐ చంద్రశేఖర్, సీసీఐ సీఐ సాయికుమార్ ను అభినందించారు.