
- మీర్పేట్ మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్
- టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు
- త్వరలోనే నేరం రుజువవుతుందని వెల్లడి
ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న చిన్న గొడవల కారణంగానే తన భార్య పుట్ట వెంకటమాధవిని నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారం హత్య చేశాడని పోలీసులు తేల్చారు. హత్య అనంతరం శిక్ష పడకుండా ఉండేలా ఆధారాలు దొరకకుండ చేయాలనే తన భార్య డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి డిస్పోజ్ చేసినట్టు గుర్తించారు. కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు మంగళవారం వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి(39)కి, అదే ప్రాంతానికి చెందిన వెంకటమాధవి(35)కి13 ఏండ్ల క్రితం పెండ్లి జరిగింది.
వీరికి కొడుకు(12), కూతురు(10) ఉన్నారు. ఆర్మీలో 15 ఏండ్లు జవాన్ గా పని చేసి, రిటైర్ అయిన గురుమూర్తి హైదరాబాద్ మీర్ పేట్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా డీఆర్ డీఎల్ లో ఓ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భార్యను హతమార్చాలని గురుమూర్తి భావించాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తేదీన బడంగ్ పేట్ లోని బంధువుల ఇంటికి గురుమూర్తి, ఆయన భార్య, పిల్లలు వెళ్లారు. తిరిగి 15వ తేదీ రాత్రి భార్యాభర్తలు మాత్రమే తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే ప్లాన్ వేసుకున్న గురుమూర్తి.. 16వ తేదీన ఉదయం 6 గంటలకు లేవగానే భార్యతో అకారణంగా గొడవకు దిగి, ఆమెపై దాడి చేశాడు. గోడకు బలంగా బాదడంతో తలకు తీవ్ర గాయమై ఆమె చనిపోయింది.
పది గంటల్లోనే డెడ్ బాడీ డిస్పోజ్..
వెంకటమాధవి డెడ్ బాడీని ఎలాంటి ఆధారాలు లేకుండా మాయం చేసి, కేసును డైవర్ట్ చేయాలని గురుమూర్తి భావించాడు. ఒకవేళ పోలీసులు హత్య అని గుర్తించినా.. ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని అనుకున్నాడు. ముందుగా డెడ్ బాడీని బాత్ రూంలోకి తీసుకెళ్లాడు. కండ్లు, ఆ తర్వాత చేతులు, మెడ వేరు చేశాడు. ఎముకల నుంచి మాంసం కోశాడు. తర్వాత మాంసం ముద్దలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బకెట్ లో వేసి హీటర్ పెట్టి బాయిల్ చేశాడు. ఆ నీటిని టాయిలెట్ కుండీలో వేసి ఫ్లష్ చేశాడు. తర్వాత మాంసం ముక్కలను స్టవ్ పై కాలుస్తూ బొగ్గుగా మార్చాడు. ఆ బొగ్గు ముక్కలను కూడా టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేశాడు. తర్వాత ఎముకలను రోలు, రోకలితో దంచి పిండిగా మార్చి, పక్కకు పెట్టాడు. అనంతరం రూమ్ ను డిటర్జెంట్, ఫినాయిల్, యాసిడ్ తో క్లీన్ చేశాడు. ఆ తర్వాత ఎముకల పిండిని బకెట్ లో తీసుకుపోయి జిల్లెలగూడ సందె చెరువులో కలిపేశాడు. ఉదయం 8 గంటలకు భార్యను హత్య చేసిన గురుమూర్తి.. సాయంత్రం 6 గంటలకల్లా పది గంటల్లోనే డెడ్ బాడీని డిస్పోజ్ చేశాడని పోలీసులు వెల్లడించారు.
అమాయకుడిలా మిస్సింగ్ కంప్లయింట్..
చెరువులో ఎముకల పొడిని కలిపిన గురుమూర్తి నేరుగా బడంగ్ పేట్ కు వెళ్లి తన పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే ఏదో స్మెల్ వస్తుందని పిల్లలు అడిగితే సర్ది చెప్పాడు. అమ్మ ఎక్కడని అడిగితే.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్నాడు. వెంకటమాధవి కోసం పేరెంట్స్ కాల్ చేయగా.. కనిపించడం లేదన్నాడు. తర్వాత అమాయకుడిలా అత్తామామలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వెంకటమాధవి ఇంటి నుంచి బయటికి వెళ్లనేలేదని గుర్తించారు. అనంతరం గురుమూర్తిని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అంతకుముందు తాను హత్య చేసినట్టు మేనమామకు చెప్పిన గురుమూర్తి.. తన భార్య డెడ్ బాడీ ముక్కలను చెరువు పక్కన డస్ట్ బిన్లో వేశానని.. మున్సిపాలిటీ వాళ్లు చెత్తతోపాటు తీసుకెళ్లారని తప్పుదోవ పట్టించాడు. అయితే, ఈ కేసులో నేరస్తుడికి శిక్ష పడేలా టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాలు సేకరించామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. నేరం రుజువై, దోషికి శిక్ష పడుతుందన్నారు.