సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

హైడ్రోజన్​ పెరాక్సైడ్​, ఆక్సిటోలిన్​ కూడా.. 
పాలకు డిమాండ్​ ఉండడంతో కల్తీ బాట
యాదాద్రి జిల్లాలో ముగ్గురిని పట్టుకున్న పోలీసులు 

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడపర్తిలో రైతుల నుంచి కొద్ది మోతాదులో సేకరించిన పాలను కల్తీ చేసి బయట అమ్ముతున్న ముగ్గురిని ఎస్​ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వడపర్తికి చెందిన మేడబోయిన మహేశ్, మేడబోయిన బాలయ్య, మేడబోయిన శ్రీశైలం గ్రామంలో రైతుల నుంచి పాలు కొంటూ ఇతర ప్రాంతాల్లోని హోటళ్లలో అమ్ముతుంటారు. ఎండాకాలం కావడం, పాల ఉత్పత్తి తగ్గడం, పాల అవసరం పెరగడంతో హోటల్ యాజమానులు ఎక్కువ సప్లయ్ చేయాలని కోరారు. దీంతో రైతుల నుంచి కొన్న పాలకు కొన్ని కెమికల్స్ కలిపి కల్తీ చేసి అమ్ముతున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులతో కలిసి వడపర్తిలోని కల్తీ జరుగుతున్న ప్రదేశంపై రైడ్​చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 480 లీటర్ల కల్తీ పాలు, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 200 మిల్లీలీటర్ల ఆక్సిటోలిన్ బాటిల్, రెండు కిలోల మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సర్ఫ్ ప్యాకెట్లు, నాలుగు గోల్డ్ డ్రాప్ నూనె ప్యాకెట్లు సీజ్ చేశామని రూరల్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.