25 తులాల బంగారం, 400 గ్రాముల వెండి, రెండు బైకులు స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ దార్ల నెహెమియా అలియాస్ బ్రూస్లీ(27)ని పోలీసులు పట్టుకున్నారు. ఇతనిపై తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 53 చోరీ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 13 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తాజాగా ఈనెల 10న చందానగర్పీఎస్పరిధిలోని ఓ రిటైర్డ్ బీహెచ్ఈఎల్ఉద్యోగి ఇంట్లో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. పోలీసులు బ్రూస్లీ నుంచి 25 తులాల బంగారం, 400 గ్రాముల వెండి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ జోన్ డీసీపీ డా.జి.వినీత్ శుక్రవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో వివరాలు వెల్లడించారు.
చందానగర్ గౌతమినగర్‌లో ఉండే వెంకటేశ్వరరావు(71) రిటైర్డ్బీహెచ్ఈఎల్ఉద్యోగి. ఈ నెల 10న అర్ధరాత్రి 11.30 గంటలకు తన కూతురును శంషాబాద్ఎయిర్పోర్టులో డ్రాప్చేసేందుకు భార్య, కొడుకుతో కలిసి వెళ్లాడు. 11న తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు పార్క్చేసిన స్కూటీ కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లి చూడగా, మెయిన్డోర్లాక్పగళగొట్టి ఉంది. రెండు బెడ్‌రూమ్‌లలోని బీరువాల్లో దాచిన 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి, రూ.2.20 లక్షల క్యాష్ కనిపించలేదు. చోరీ జరిగిందని తెలుసుకున్న వెంకటేశ్వరరావు చందానగర్పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా చోరీ చేసింది కర్ణాటకలోని గాంధీవాడకు చెందిన పాత నేరస్తుడు బ్రూస్లీ(27) అని గుర్తించారు. 15న బ్రూస్లీని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 11 దొంగతనాలు బయటపడ్డాయి. దొంగిలించిన సొత్తును జీడిమెట్ల వినాయక్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ నాగేష్(25), సౌరమ్మ(38), షాపూర్‌నగర్‌కు చెందిన జ్యువెలరీ షాప్ఓనర్సురేశ్(39)తో కలిసి అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు. నలుగురిని అరెస్ట్చేశామని, మరో నిందితుడు మహేందర్ పరారీలో ఉన్నాడని డీసీపీ వినీత్తెలిపారు.
ఒకేసారి రెండు, మూడు ఇండ్లలో..
బ్రూస్లీ ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక దొంగతనాలు చేశాడు. ఇతనిపై సైబరాబాద్కమిషనరేట్ పరిధిలో17 కేసులు, హైదరాబాద్పరిధిలో 12 కేసులు, రాచకొండ పరిధిలో 6 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్ లో 9, సికింద్రబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 13 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. బ్రూస్లీ పగలు కాలనీల్లో రెక్కీ నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తాడు. రాత్రి పూట వాటిలో చోరీలకు పాల్పడతాడు. ఒకేసారి రెండు, మూడు ఇండ్లలో చోరీలు చేసి పరారవుతాడు. అనంతరం తన మకాం మారుస్తూ ఉంటాడు. జైలుకు వెళ్లి వచ్చాక 11 దొంగతనాలు చేశాడు.