పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో రేవంత్ ఇంటి ముందు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. ఈ సందర్భంగా పోలీసులకు, రేవంత్ కు మధ్య వాగ్వాదం జరిగింది. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు రేవంత్. గాడిదల ముందు కేక్ కట్ చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్. దీంతో రేవంత్ ను అదుపులోకి తీసుకున్నారు. మొదట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామని చెప్పినప్పటికీ.. ఏ పీఎస్ కు తరలించకుండా వాహనంలోనే సిటీలో తిప్పుతున్నారు పోలీసులు.
మరోవైపు రేవంత్ అరెస్ట్ ను ఖండించారు పార్టీ నేతలు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ నిర్బంధ కాండ అమలు చేస్తోందన్నారు. ప్రతి రోజూ అరెస్టులు ఏంటని ప్రశ్నించారు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లురవి. ప్రజలు త్వరలోనే కేసీఆర్ కు బుద్ది చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు.