నల్గొండ అర్బన్, వెలుగు : ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ రిపోర్టర్ నాగుల ఆనంద్ కుమార్ ను పోలీసులు అరెస్ట్చేశారు. సోమవారం నల్గొండ ఎస్పీ ఆఫీసులో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు నిందితుడి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు తుప్పరి రఘు, పెరబోయిన ఆంజనేయులును ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపారు. డిజిటల్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా చెప్పుకుంటున్న నాగుల ఆనంద్ కుమార్.. అతడి స్నేహితులు రఘు, ఆంజనేయులుతో కలిసి నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను టార్గెట్ గా చేసుకొని వారిపై కల్పిత వార్తలను ప్రచురించి.. బెదిరించి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేశారు.
నల్గొండ జిల్లా వైద్యారోగ్యశాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గా కొంపల్లి మత్స్యగిరి పారా మెడికల్ యూనియన్ లో చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆరోగ్యశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆగస్టు 27న పేపర్ లో మత్స్యగిరిపై అసత్య వార్తలను ప్రచురించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆతర్వాత మత్స్యగిరికి వాట్సాప్ కాల్స్ చేసి రూ.4 లక్షలు ఇవ్వాలని, లేదంటే అక్రమాలకు నిన్నే బాధ్యుడిగా ప్రచారం చేస్తామని బెదిరించారు.
అతడెంత వేడుకున్నా వినకుండా వేధించడంతో సెప్టెంబర్ 1న రూ.50 వేలు గూగుల్ పే ద్వారా పంపాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో మరో రూ.40 వేలు ఇచ్చాడు. వీరి ఆగడాలపై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా మత్స్యగిరి ఈనెల 2న నల్గొండ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిపి ప్రధాన నిందితుడు నాగుల ఆనంద్ కుమార్ ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.