- బంగారు నగలకు మెరుగు పెడ్తామని మోసం
- ఖమ్మం జిల్లా కల్లూరులో ఇద్దరి అరెస్ట్
కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలో బంగారు ఆభరణాలను మెరుగు పెడ్తామని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలను ఏసీపీ బొజ్జ రామానుజం వెల్లడించారు.. కల్లూరు మేజర్ పంచాయతీ పరిధిలోని శాంతినగర్ కాలనీకి చెందిన ఖమ్మంపాటి రమాదేవి ఇంటికి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 14న వచ్చారు. బంగారం మెరుగుపెడ్తామని చెప్పారు. 40 గ్రాముల బంగారు పుస్తెలతాడును మెరుగు పెట్టినట్లు నటించి ఒక గిన్నెలో యాసిడ్ వేసి వేడి చేసి అందులో ఆ పుస్తెలతాడును కొంతవరకు కరిగించారు. దాన్ని పేపర్ లో పెట్టి గంట వరకు తీయవద్దని, తీస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు. గంట తర్వాత పేపర్ విప్పి చూడగా 40 గ్రాముల పుస్తెలతాడు 14 గ్రాములకు తరిగిపోయింది. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పొద్దున కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు బిహార్ రాష్ట్రానికి చెందినవారని, వీరి పేర్లు బికో కుమార్, చోటు కుమార్ గా చెప్పారు. బంగారం మెరుగు పేరుతో మోసం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.