వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. దోపిడీ గ్యాంగ్ లోని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారినుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.
ఇటీవల వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్ బీఐ బ్యాంకులో జరిగిన బంగారం చోరీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం కోటి 84 లక్షల విలువైన 2కిలోల 520 గ్రాముల బంగారం దోపిడి దొంగల ముఠా చోరీ చేసింది.
గూగుల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులను సెర్చ్ చేసి రెక్కీ నిర్వహించి దోపిడి దొంగలు చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన సొత్తును ఏడుగురు నిందితులు ఏడు వాటాలుగా పంచుకున్నట్లు విచారణలో తేలింది.
నిందితుల్లో ఆర్షాద్ అన్సారీ, షాకీర్ ఖాన్ అలియాస్ బోలెఖాన్, హిమాన్షు బిగాం చండ్ జాన్వర్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ ముఠాలోని మహమ్మద్ నవాబ్ హాసన్, అక్షయ్ గజనాన్, సాగర్ భాస్కర్ గోర్, సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.