ఏడేండ్ల క్రితం ఇంట్లో పూడ్చిన భార్య శవం వెలికితీత

పర్వతగిరి, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపి ఏడేండ్ల క్రితం ఇంట్లో పూడ్చి పెట్టగా పోలీసులు సోమవారం తవ్వి తీశారు. రెండో భార్య హత్య కేసు విచారిస్తుండగా మొదటి భార్య మర్డర్​విషయం ఇటీవల బయటపడింది. ఎంక్వైరీలో భాగంగా కోర్టు పర్మిషన్​తో ఆ సైకో భర్తను సొంతూరికి తీసుకొచ్చారు. మామునూర్ ఏసీపీ నరేశ్ కుమార్, పర్వతగిరి సీఐ కిషన్​తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్​రూరల్​జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన కర్నె కిరణ్ ఏడేండ్ల క్రితం సంగెం మండలం గవిచర్లకు చెందిన చిలువేరు పద్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత అనుమానంతో ఆమెను వేధించి కొట్టి చంపేశాడు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. పొరుగువారిని ఆమెకు విడాకులు ఇచ్చేసినట్లు నమ్మించాడు. తర్వాత వరంగల్ అర్బన్​ జిల్లా కమాలాపూర్ మండలం ఉప్పల్​కు చెందిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత కట్నం కోసం ఆమెను కూడా వేధించడం మొదలుపెట్టాడు. ఈనెల12న ఆమెతో గొడవపడి కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. ఎంజీంఎంలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసులో పోలీసులు కిరణ్​ను అరెస్టు చేసి విచారించగా మొదటి భార్య హత్య బయటపడింది. సోమవారం అతన్ని తీసుకుని పోలీసులు ఏనుగల్లులోని ఇంటికి వచ్చారు. పద్మను పూడ్చి పెట్టిన స్థలంలో ఫోరెన్సిక్​ ఆఫీసర్ల సమక్షంలో తవ్వించారు. మృతురాలి అస్థిపంజరం బయటపడింది. దాన్ని డీఎన్ఏ టెస్టుకు పంపనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​మహబూబ్​అలీ, పర్వతగిరి సీఐ కిషన్, ఇన్​చార్జ్ ఎస్సై సురేశ్, ట్రైనీ ఎస్సై రాజేందర్​తదితరులు పాల్గొన్నారు.