ఇసుక అక్రమ దందా వ్యవహారంలో ఐజీ ఆదేశాలు బేఖాతర్​

 ఇసుక అక్రమ దందా వ్యవహారంలో  ఐజీ ఆదేశాలు బేఖాతర్​
  • 12  మంది ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలంటూ ఈనెల 2న ఆర్డర్స్
  • ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయాలని ఉత్తర్వులు
  • ఐజీ ఆదేశాలను పట్టించుకోని పోలీస్ అధికారులు 
  • నేటికీ యథాస్థానంలో కొనసాగుతున్న ఎస్ఐలు

నల్గొండ, వెలుగు : అక్రమ ఇసుక రవాణా నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ వ్యవహారంలో ఐజీ ఆదేశాలను సైతం పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. మల్టీ జోన్- 2 పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 12  మందిపై చర్యలు తీసుకోవాలని ఈనెల 2న ఐజీ ఆర్డర్స్ జారీ చేశారు. అయితే ఆర్డర్స్ ఇచ్చి 20 రోజులు కావస్తున్నా పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హడావుడిగా ఆర్డర్స్ ఇచ్చిన పోలీస్ శాఖ వాటిని అమలు చేయకపోవడంతో నేటికీ ఎస్సైలు యథాస్థానంలో కొనసాగుతుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇసుక రవాణాను నియంత్రించడంలో విఫలం..

అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులపై ఐజీ సత్యనారాయణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొత్తం మల్టీ జోన్- 2 పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువగా ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. ఇసుక, పీడీఎస్ బియ్యం రవాణా, గ్యాంబ్లింగ్, మట్కా లాంటి అక్రమ దందాలు చేస్తున్న పోలీసులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇందులో భాగంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని మొత్తం 12 మంది ఎస్ఐలపై బదిలీ వేటు వేసింది. 

వీరిలో కొంతమందిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్) కు అటాచ్ చేస్తూ అక్టోబర్ 2న ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో నల్లగొండ జిల్లాకు చెందిన వాడపల్లి, హాలియా, సూర్యాపేట జిల్లాకు చెందిన తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్ పహాడ్ ఎస్ఐలను లూప్ లైన్ పంపుతూ జిల్లా ఎస్పీలకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పరోక్షంగా సహకరిస్తున్న ఎస్ఐలపై ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి మరో చోటుకు బదిలీ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.      

ఐజీ ఆదేశాలను పక్కనపెట్టిన్రు..

ఐజీ ఆదేశాలను అమలు చేయకుండా పోలీస్ అధికారులు పక్కకు పెట్టడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా, అడవిపల్లి, వేములపల్లి, నార్కట్ పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారాం, జాజిరెడ్డిగూడెం మండలాలకు చెందిన 12 మంది ఎస్ఐలు ఉన్నారు.

 ఇందులో ఇప్పటివరకు వేములపల్లి, మాడుగులపల్లి, తుంగతుర్తి, నార్కెట్ పల్లి, చింతలపాలెం, హాలియా మండలాలకు చెందిన ఎస్ఐలను మాత్రమే బదిలీ చేశారు. మిగతా మండలాల ఎస్ఐలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నేటికీ వారు దర్జాగా యథాస్థానంలోనే కొనసాగుతున్నారు. ఆత్మకూర్(ఎస్), పెన్ పహాడ్ మండలాల ఎస్ఐలను వీఆర్ కు అటాచ్ చేయకుండా పక్కన పెట్టారు.  

కొనసాగుతున్న అక్రమ రవాణా..

ఐజీ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలోని ఎస్ఐలలో ఎలాంటి మార్పు రాలేదు. నాగారం, జాజిరెడ్డిగూడెం, పెన్ పహాడ్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణా యాథేచ్ఛగా సాగుతోంది. తాజాగా పెన్ పహాడ్ మండలానికి చెందిన ఎస్ఐ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇసుక ట్రాక్టర్ వ్యవహారంలో ట్రాక్టర్ యజమానితో ఎస్ఐ బేరసారాలు ఆడుతున్న ఆడియో బయటకు రావడంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బదిలీలు కాకుండా పైరవీలు చేసుకొని యథాస్థానంలో కొనసాగేలా ఎస్ఐలు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దీనికి పోలీస్ శాఖలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం.