అసాంఘిక శక్తులపై పోలీసుల నజర్.. మావోయిస్టుల కదలికలపై నిఘా

  • రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
  • సరిహద్దుల్లో చెక్​పోస్టులు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో అసాంఘిక శక్తులపై పోలీసులు నజర్​ పెట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్​ రానున్నది. ఆంధ్రా, ఛత్తీస్​గఢ్, ఒడిశా, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో పోలింగ్ ​నిర్వహణ పోలీసులకు పెనుసవాల్​గా మారింది. ఈ క్రమంలో పోలీస్​ అధికారులు ఇప్పటి నుంచే అన్ని విషయాలపై ఆరా తీస్తూ అలర్ట్​గా ఉంటున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బుల తరలింపును అడ్డుకోవడం, మావోయిస్టుల విప్లవ కారిడార్​ నోట్​లో ఉన్న భద్రాచలంలో నక్సల్స్ కదలికలను నియంత్రించి పోలింగ్​ కేంద్రాలకు సామాగ్రిని, సిబ్బందిని తరలించడం.. లాంటివాటిపై పోలీసులు పక్కా ప్లాన్​తో ముందుకుపోతున్నారు.  

ALSO READ  :- ఎమ్మెల్యేలకు నిరసన సెగ.. డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లపై నిలదీత

ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో భద్రాచలంలో రెండు దఫాలుగా మీటింగ్​ నిర్వహించారు. యాక్షన్​ ప్లాన్​ తయారు చేశారు.  గత రెండు రోజులుగా భద్రాచలం ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ అన్ని పోలీస్​ స్టేషన్లను సందర్శిస్తున్నారు.  రౌడీషీటర్లను పిలిచి కౌన్సిలింగ్​నిర్వహిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? ప్రవర్తన ఎలా ఉంది? స్థానిక పోలీసుల ద్వారా ఆరా తీస్తున్నారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుని భద్రాచలం , దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో అసాంఘిక శక్తుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో పికెటింగ్​లు ఏర్పాటు చేశారు. కూనవరం రోడ్డులో ఎంవీఐ ఆఫీసు వద్ద, చర్ల రోడ్డులో రాజుపేట సమీపంలో చెక్​పోస్టులు పెట్టి పోలీసులు, సీఆర్​పీఎఫ్ జవాన్లతో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.

గిరిపల్లెల్లోకి అన్నలను రానీయొద్దని ప్రచారం

గిరిపల్లెల్లోకి అన్నలను రానీయొద్దని పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు. గిరిజనులను చైతన్యపరచడం, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం లాంటివి చేస్తున్నారు. మరో వైపు బలగాలతో సరిహద్దుల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు.పల్లెల్లో ప్రశాంత వాతావరణం కల్పించడం, భయం లేకుండా పోలింగ్​ కేంద్రాలకు వచ్చి జనం ఓటేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రశాంత వాతావరణమే మా లక్ష్యం 

ఎన్నికల వేళ ప్రశాంత వాతావరణం కల్పించడమే మా ముందున్న లక్ష్యం. రౌడీషీటర్లు పద్ధతి మార్చుకొని మంచిగా జీవించాలి. నేరప్రవృత్తిని వీడితే రౌడీషీట్లు తొలగిస్తాం. లేదంటే పీడీ యాక్టు నమోదు చేస్తాం. 

ఏఎస్పీ పంకజ్​  పరితోష్​