హనుమకొండ/వరంగల్, వెలుగు : వరంగల్ నగరంలో శనివారం జరగనున్న ప్రధాని మోదీ టూర్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓ వైపు టీఎస్‌పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీస్ (టీపీబీవో) ఎగ్జామ్, మరో వైపు ప్రధాని టూర్ ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. సుమారు 3 వేల మంది వరంగల్ నగరంలో టీపీబీవో ఎగ్జామ్‌కు హాజరుకానుండడంతో క్యాండిడేట్లు అంతా 8 గంటల్లోపే సెంటర్లకు చేరుకోవాలని సీపీ రంగనాథ్ సూచించారు. ప్రధాని టూర్ ఉన్నందున ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదాలత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ మార్గంలో శనివారం ఉదయం వెహికల్స్‌కు అనుమతి ఉండదన్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప సభకు వచ్చే వెహికల్స్ ఉదయం 9.30లోపే రావాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్ల మీదకు బండ్లు తీసుకురావొద్దన్నారు. అనంతరం ఈస్ట్‌జోన్ డీసీపీ కరుణాకర్‌తో కలిసి ట్రాఫిక్ మళ్లింపు వివరాలను వెల్లడించారు.
హుజూరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వెహికల్స్ చింతగట్టు రింగ్ రోడ్డు, కరుణాపురం మీదుగా మళ్లించారు. ఖమ్మం వైపు వెళ్లే వెహికల్స్ కరుణాపురం, ఐనవోలు, పున్నేలు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పరకాల, ములుగు నుంచి హైదరాబాద్, ఖమ్మం వెళ్లే వెహికల్స్‌ను ఇదే రూట్‌లో మళ్లించారు.
నర్సంపేట వైపు హైదరాబాద్, కరీంనగర్ వైపు వెళ్లే వెహికల్స్‌ను వెంకట్రామ జంక్షన్, పోచమ్మ మైదాన్, దేశాయిపేట 80 ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమాన్ జంక్షన్, పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్, చింతగట్టు రింగ్ వైపు మళ్లించారు.
వర్ధన్నపేట వైపు నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పరకాల, భూపాలపల్లి వెళ్లే వెహికల్స్ పున్నేలు క్రాస్‌లో డైవర్షన్ తీసుకొని ఐనవోలు, కరుణాపురం రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
బహిరంగ సభకు వచ్చే వెహికల్స్‌కు ప్రత్యేక రూట్
హుజురాబాద్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ సమ్మయ్యనగర్, సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, తిరుమల జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించి, ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూ ఎస్‌డీఎల్‌సీఈ గ్రౌండ్‌లో పార్క్ చేయాలి. పరకాల, భూపాలపల్లి, ములుగు నుంచి వచ్చే వెహికల్స్ పెద్దమ్మగడ్డ నుంచి డైవర్షన్ తీసుకుని ఇదే మార్గాన్ని అనుసరించాలి. నర్సంపేట వైపు నుంచి వచ్చే వెహికల్స్ వెంకట్రామ జంక్షన్, పోచమ్మ మైదాన్, దేశాయిపేట 80 ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమాన్ జంక్షన్, పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్ మీదుగాపై రూట్‌నే ఫాలో కావాలి. ఈ మూడు మార్గాల నుంచి వచ్చే వెహికల్స్ ఉదయం 9.30 గంటల్లోపు సుబేదారి పీఎస్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే వాటిని కేయూ జంక్షన్ వరకే అనుమతిస్తారు.
వర్ధన్నపేట వైపు నుంచి వచ్చే వాహనాలు పున్నేలు క్రాస్, ఐనవోలు, కరుణాపురం మడికొండ, కాజీపేట మీదుగా ఫాతిమా జంక్షన్ వద్ద ప్రజలను దించి ఖాళీ వాహనాలను సెయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌లో పార్క్ చేయాలి. ఘన్‌పూర్ నుంచి వచ్చే వాహనాలు కరుణాపురం, మడికొండ, కాజీపేట మీదుగా ఫాతిమా జంక్షన్ వద్ద ప్రజలను దించి ఖాళీ వాహనాలను సెయింట్ గాబ్రియల్ స్కూల్‌గ్రౌండ్‌లో పార్క్ చేయాలి.