తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించే చిన్నారుల కోసం కేరళ పోలీసులు ప్రత్యేక గుర్తింపు బ్యాండ్‌లను రూపొందించారు. పంపా నుండి దర్శనం కోసం వెళ్లే 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ వారి పేరుతో పాటు వారితో వచ్చే పెద్దల మొబైల్ నంబర్ రాసిన రిస్ట్‌బ్యాండ్‌లను పిల్లలకు చేతికి అంటిస్తారు. భక్తుల రద్దీ మధ్య పిల్లలు తప్పిపోయినట్లు అయితే.. రిస్ట్ బ్యాండ్‌పై ఉన్న వివరాల ఆధారంగా వారిని త్వరగా గుర్తించడమే దీని లక్ష్యమని కేరళ పోలీసులు వెల్లడించారు.
తప్పిపోయిన పిల్లలను ఈజీగా తిరిగి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంలో ఈ రిస్ట్ బ్యాండ్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు పోలీసులు. అయితే, దర్శనానికి వచ్చిన పిల్లలు.. తీర్థయాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు సురక్షితంగా తమ వాహనాల్లోకి వచ్చే వరకు ఈ రిస్ట్ బ్యాండ్లు తొలగించకుండా ఉండేలా పిల్లల వెంట వచ్చే వారు జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు. కాగా, 2024, నవంబర్ 15 శుక్రవారం నుండి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు మొదలైన సంగతి తెలిసిందే. మండల -మకరవిళక్కు సీజన్‌లో భాగంగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆలయాన్ని ఓపెన్ చేశారు.
Also Read :- లక్నవరం ఊటీ, సిమ్లాలను తలపిస్తుంది
2024, నవంబర్ 16 శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ సీజన్‌లో దర్శన సమయాలను 18 గంటలకు పొడిగిస్తూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. శనివారం ప్రారంభమైన మండల సీజన్ అధికారికంగా డిసెంబర్ 26 వరకూ కొనసాగనుండ.. డిసెంబర్ 30వ తేదీ నుంచి స్టార్ట్ కానున్న మకరవిళక్కు సీజన్ జనవరి 20, 2025 వరకూ కొనసాగనుంది. ప్రతీ రోజూ 18 గంటల పాటు దర్శనాలకు అనుమతి ఇవ్వగా.. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులకు దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అధికారులు తెలిపారు.