- ఓ వైపు కోళ్ల కొనుగోళ్లు.. మరో వైపు పందేలు
- జిల్లాను జల్లెడ పడుతున్న ఏపీకి చెందిన కోళ్ల పందెం రాయుళ్లు
- ఒక్కో కోడికి రూ. 3వేల నుంచి రూ. 40వేల వరకు పలుకుతున్న ధర
- పందేలు అడ్డుకోవడంపై పోలీసుల స్పెషల్ ఫోకస్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పందెం కోళ్ల కోసం ఏపీలోని పందెం రాయుళ్లతో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలువురు వేట ప్రారంభించారు. నాణ్యమైన పందెం కోళ్లు ఎక్కడెక్కడ పెంచుతున్నారో ఆరా తీస్తున్నారు. ఒక్కో కోడికి రూ. 3వేల నుంచి రూ. 40వేల వరకు ధర పెడుతున్నారు. పలు గ్రామాల్లో కోళ్ల పందేలు కూడా అప్పుడే మొదలయ్యాయి.
అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నరు
సంక్రాంతికి రెండు వారాల ముందే పందెం కోళ్లకు మంచి డిమాండ్ పెరిగింది. పండుగ దగ్గర వచ్చేకొద్దీ పందెం కోళ్లకు ధరలు పెరిగే అవకాశం ఉండడంతో పందెం రాయుళ్లు ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి కోళ్లను బుక్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పందెం రాయుళ్లు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటున్నారు. దీంతో ధరలు బాగా పెరుగుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కోళ్ల పెంపకం..
జిల్లాలోని అశ్వారావుపేట మండలంలోని అల్లిగూడెం, వాగొడ్డుగూడెం మందలపల్లి, ముష్టిమండ, నాచారంతో పాటు ఆయిల్ పాం తోటల్లో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇల్లెందు, చండ్రుగొండ, లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, బూర్గంపహడ్ మండలాల్లోనూ పందెం కోళ్ల పెంపకాలు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో కోడి రూ.40వేల వరకు పలుకుతోంది. సీత్వా, పచ్చకాకి, అబ్రాస్, పింగళ, రతంగి, కక్కిరాయి, నెమలి, పర్ల, డేగ, కాకి డేగ, గరుడమైల, నెమలి పింగళ, మెట్టవాటం, రిచ్వాటం, వీడికాళ్లు లాంటి పందెం కోళ్లకు ఎక్కువ ధర పెడుతున్నారు.
పందేలపై పోలీసుల ఫోకస్..
కోళ్ల పందేలు ఆడుతున్న వారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్పెట్టారు. ఇప్పటికే పినపాక, బూర్గంపహడ్, దమ్మపేట మండలాల్లో కోళ్ల పందేలు ఆడుతున్న వారిని ఇటీవల అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. కోళ్ల పందేలు ఆడే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అప్పుడే మొదలైన పందేలు..
జిల్లాలో అప్పుడే కోళ్ల పందేలు మొదలయ్యాయి. లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లి, చుంచుపల్లి, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, దమ్మపేట, పినపాక, అశ్వారావుపేట మండలాల్లోని పలు ప్రాంతాల్లోని మామిడి తోటలతో పాటు శివారు ప్రాంతాల్లో ఈ కోళ్ల పందేలను కాస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు తెలంగాణ –ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన వేలేరు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, సీతారం నగర్, టి. నర్సాపురం, జీనంబెల్లి, తిరువురుతో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్ల పందేలు కొనసాగుతాయి. వీటిని చూసేందుకు వేలాది మంది తరలి వెళ్తారు.