పోయిన ఫోన్లు దొరుకుతున్నయ్..కరీంనగర్ జిల్లాలో రికవరీ చేసిన పోలీసులు

  •     ఉమ్మడి జిల్లాలో 1,318 సెల్ ఫోన్ల రికవరీ చేసిన పోలీసులు 
  •     ఏడున్నర నెలల్లో 5,449 ఫోన్లు బ్లాక్ 
  •     రామగుండం పరిధిలో అత్యధికంగా 418 ఫోన్ల అప్పగింత 

కరీంనగర్, వెలుగు : ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులు ఇట్టే పట్టేసి బాధితులకు అప్పగిస్తున్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) పోర్టల్ ద్వారా ట్రేస్ అవ్వని ఫోన్లు పని చేయకుండా బ్లాక్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి ఈ నెల 7 వరకు మొత్తం 5,449 ఫోన్లను పోలీసులు బ్లాక్ చేయగా, వాటిలో1,318 మొబైల్ ఫోన్లను గుర్తించి పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఫోన్లు పోగొట్టుకున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో రామగుండం కమిషనరేట్ పరిధిలో 1813 ఫోన్లను బ్లాక్ చేయగా, కరీంనగర్ జిల్లాలో 1531, జగిత్యాల 1030, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1075 ఫోన్లను బ్లాక్ చేశారు. వీటిలో రామగుండంలో 888, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 465, కరీంనగర్ జిల్లాలో 654, జగిత్యాల జిల్లాలో 447 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయగలిగారు. ఇలా గుర్తించిన వాటిలోనూ కరీంనగర్ జిల్లాలో 360, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 383, రామగుండం కమిషనరేట్ పరిధిలో 418, జగిత్యాల జిల్లాలో 157 సెల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించారు.

ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లోగానీ, మీ సేవా సెంటర్లలోగానీ లేదా https//www.ceir.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని పోలీసాఫీసర్లు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చోరీకి గురైన మొబైల్ లో వేరొక సిమ్ వేస్తే వెంటనే టెలికం ఆపరేటర్ ద్వారా సీఈఐఆర్  పోర్టల్ తోపాటు సెల్ ఫోన్ ఓనర్ కు మెస్సేజ్ వెళ్తుంది. అలాగే సెల్ ఫోన్ ఉపయోగించే వ్యక్తి సిమ్ కార్డు నంబర్ తోపాటు ఎక్కడ వినియోగిస్తున్నారనే వివరాలు పోలీసులకు తెలిసిపోతున్నాయి. దీంతో ఫోన్ రికవరీ ఈజీ అవుతుంది.