- 9 మందిపై కేసు నమోదు, ముగ్గురు అరెస్ట్
- పరారీలో మరో ఆరుగురు
- నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర వెల్లడి
మిర్యాలగూడ, వెలుగు: రూ.5 కోట్లు అప్పు ఇప్పిస్తామని, రూ.60 లక్షలు ఎత్తుకెళ్లిన 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రూ.5 కోట్లు అప్పిస్తామని 60 లక్షల దోపిడీ
వన్ టౌన్ పీఎస్‌లో డీఎస్పీ రాజశేఖర రాజుతో కలిసి కేసు వివరాలను బుధవారం ఎస్పీ వెల్లడించారు.
హైదరాబాద్‌లోని చందానగర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన వ్యాపారానికి రూ.5 కోట్లు అవసరమని శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన కండెల గణేశ్, మల్లికార్జున్‌ను సంప్రదించాడు. గత నెల 31న సమీర్‌ను నమ్మించేందుకు రూ.90 లక్షలు అప్పుగా ఇచ్చిన గణేశ్, మల్లికార్జున్..సమీర్ నుంచి బ్యాంకు చెక్కులు, ప్రామిసరీ నోటు, ఇంటి కాగితాలు తీసుకున్నారు. ఈ నెల 5న మొదటగా ఇచ్చిన రూ.90 లక్షలతో పాటు రూ.5 కోట్లకు ముందు ఇచ్చే ఇంట్రెస్ట్ డబ్బులు రూ.60 లక్షలతో మిర్యాలగూడకు రమ్మని కోరారు. అదే రోజు సమీర్ తన పార్ట్‌నర్స్‌తో కలిసి గాంధీనగర్‌లోని వీరన్న ఇంటికి వచ్చాడు.
అప్పటికే ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న నిందితులు కండెల గణేశ్, మల్లికార్జున్, విజయ్, రాజు, గంగమ్మ, ఎల్బీనగర్కు చెందిన కండెల అనుపమ, హైదరాబాద్ కొంపల్లికి చెందిన కండెల వెంకటమ్మ, వీరమ్మ కలిసి సమీర్‌తో చర్చించారు. అప్పుగా ఇచ్చిన రూ.90 లక్షలు తీసుకొని, రూ. 5 కోట్లకు ఇచ్చే ఇంట్రెస్ట్ రూ.60 లక్షలు చూపించాలని కోరారు. ఆ డబ్బు చూపుతున్న క్రమంలో దాడి చేసి రూ. 60 లక్షలతో పరారయ్యారు. కాసేపటికి తేరుకున్న బాధితులు డయల్100కు ఫిర్యాదు చేయడంతో.. అప్రమత్తమైన డీఎస్పీ రాజశేఖర్ రాజు మూడు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి అనుపమ, వీరమ్మ, వెంకటమ్మను అరెస్టు చేశారు.
వారి నుంచి రూ. 60 లక్షల నగదు, మనీ కౌంటింగ్ మెషీన్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కండెల గణేశ్, మల్లికార్జున్, విజయ్, రాజు, వీరన్న, గంగమ్మ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై ఇదే తరహాలో ఎల్బీనగర్ పీఎస్‌లోనూ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐలు నాగార్జున, సుధాకర్, ఎస్సైలు శేఖర్, నరేశ్ ఉన్నారు.