యాస్ప్రిన్ బయో ఫార్మసీ నిర్వాహకులపై కేసు .. సోదాల్లో 95 కేజీల మెడిసిన్​ పౌడర్​ సీజ్​

తల్లాడ, వెలుగు: ఖమ్మం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న యాస్ప్రిన్ బయో ఫార్మసీ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లాడ మండలం అన్నారుగూడెం సమీపంలోని కాటన్ పార్కు ఏరియాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లైసెన్స్, ఇతర అనుమతులు లేకుండా డ్రగ్స్ పౌడర్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఔషధ నియంత్రణ అధికారులు, పోలీసులు ఆ ఫార్మసీపై రెయిడ్స్​ చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించి.. 28 సంచులలో నిల్వ ఉంచిన 935 కేజీల మెడిసిన్ పౌడర్ ను సీజ్ చేసి పోలీస్​ స్టేషన్ కు తరలించారు. శనివారం పంచనామా నిర్వహించిన పోలీసులు.. పర్మిషన్​ లేకుండా డ్రగ్స్ లో ఉపయోగించే పౌడర్ ను తయారు చేస్తున్నట్టు తెలుసుకొని.. హైదరాబాద్​కు చెందిన ఫార్మసీ నిర్వాహకులు సతీశ్​రెడ్డి, ఉపేందర్ రెడ్డితో మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పౌడర్​శాంపిల్స్​ను హైదరాబాద్​ల్యాబ్​కు తరలించారు. శాంపిల్స్ రిపోర్ట్​ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ అధికారులు తెలిపారు.

కాగా.. యాస్ప్రిన్ బయో ఫార్మసీలో డ్రగ్స్ లో ఉపయోగించే పౌడర్లు తయారు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నా.. కంపెనీలో పని చేసే వర్కర్స్ మాత్రం క్యాన్సర్ మెడిసిన్ లో ఉపయోగించే సిట్లరిన్ అనే రసాయన పౌడర్ ను తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. వీరికి తల్లాడ మండలం తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో రెండు ఫ్యాక్టరీలు ఉన్నట్లు తెలిసింది. ఒకే సమయంలో ఆ మూడు చోట్ల అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం. ఈ ఫ్యాక్టరీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన మాజీ మంత్రి బంధువులకు సంబంధించినవి చర్చ జరుగుతోంది. అయితే.. ఫ్యాక్టరీలో తయారు చేసేది మెడిసిన్ పౌడరా? మత్తు పదార్థాల్లో ఉపయోగించే పౌడరా? అనేది పరీక్షల అనంతరం తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.