బండి సంజయ్ పై కుట్ర కేసులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో అర్థరాత్రి నుంచి ఉన్న బండి సంజయ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. బండి సంజయ్ కుట్ర చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్ 

బండి సంజయ్ పై ఏయే సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే వివరాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దీనిపై గందరగోళం నెలకొంది. బండి సంజయ్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి.. మాట్లాడారు. డీజీపీ సైతం ఫోన్ లో వివరాలు వెల్లడించలేదు. అన్ని వివరాలు తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. బండి సంజయ్ ను ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో..బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వరంగల్ కు తరలిస్తున్నారు.