సూర్యాపేట జిల్లా : DCMS చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. తన భర్తతో వచ్చిన విబేధాలను పరిష్కరిస్తానని చెప్పి.. తన ఇల్లును ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేశాడని ఓ మహిళ వట్టే జానయ్యపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ సొంతూరు సూర్యాపేట మండలం దాస్యానాయక్ తండా. న్యాయం కోసం వెళ్లిన తనను బూతులు తిట్టి ఇబ్బంది పెట్టాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
తాను ఉంటున్న ఇంటి వద్దకు తన మనుషునలు పంపించి.. భయపెడుతున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది. కోర్టు, పోలీస్ స్టేషన్ చుట్టు రెండు నెలల నుంచి తిరుగుతున్నానని వాపోయింది. తనకు ప్రాణభయం ఉందని వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై ఫిర్యాదు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే 70 మందికి పైగా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
వట్టే జానయ్య వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డి
గత కొన్ని రోజులుగా మంత్రి జగదీష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్నాడు వట్టే జానయ్య యాదవ్. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వట్టే జానయ్య యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. మంత్రి జగదీష్ రెడ్డి అవినీతి చిట్టా తన దగ్గర ఉందని చెప్పారు. త్వరలోనే ఆయన అవినీతిని బయటపెడతానని చెప్పుకొచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు ఎక్కడ పెట్టారో తనకు తెలుసని వెల్లడించారు. త్వరలోనే బయటపెడతానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని..మంత్రి జగదీష్ రెడ్డిపై తిరగబడటంతోనే తన మీద ఒక్కరోజే 70 అక్రమ కేసులు పెట్టారని తెలిపారు.