- త్వరలోనే అతడిని స్వదేశానికి పట్టుకొస్తం: డీఎస్పీ
- ఏ2 కొండూరిని రిమాండ్‌కి తరలించామని వెల్లడి
- చందుర్తి మండలం మల్యాలలో హత్య కేసును ఛేదించిన పోలీసులు
వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో నిందితుడు ఆ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు దుబాయ్ నుంచి వచ్చి ప్లాన్ ప్రకారం హత్యచేసి తిరిగి దుబాయ్ కు పారిపోయాడని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి చెప్పారు. శనివారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన కొండూరి మల్లేశం కొంతకాలం కిందట ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో అతని భార్యకి ఇంటి పక్కనే ఉండే పడిగేలా నరేశ్ (27) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో గొడవలు జరడంతో ఐదేళ్ల క్రితం నరేశ్ కూడా దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం నరేశ్.. దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చాడు. మల్లేశం భార్యతో మళ్లీ అతను వివాహేతర సంబంధం కొనసాగించాడు. తన అన్న కొడుకు లక్ష్మణ్ (20) ఈ విషయాన్ని మల్లేశంకు చెప్పాడు. దీంతో మల్లేశం అకస్మాత్తుగా దుబాయ్ నుంచి ఈనెల 8న ఊరికి వచ్చాడు. అప్పటి నుంచి బంధువుల ఇంట్లో రహస్యంగా తలదాచుకున్నాడు. నరేశ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.
Also Raed :-వెండి ధర : రూ.85 వేలకు!
ఈ క్రమంలో ఈనెల 13న సాయంత్రం నరేశ్ ఇంట్లోనే మల్లేశం కుటుంబ సభ్యులు విందు చేసుకున్నారు. అనంతరం అందరూ వెళ్లిపోయారు. ఇంటి పక్కనే కావడంతో రాత్రిపూట నరేశ్.. మల్లేశం ఇంట్లోకి వెళ్లి అతని భార్యతో ఉన్నాడు. గమనించిన లక్ష్మణ్.. బంధువుల ఇంట్లో తలదాచుకున్న తన బాబాయ్ మల్లేశంకి సమాచారం అందించాడు. వెంటనే మల్లేశం తన ఇంటికి చేరుకొని నరేశ్ ను కత్తితో పొడిచి చంపాడు. అప్పటికే ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నుంచి కాకుండా చండీగఢ్ ఎయిర్‌పోర్టు నుంచి నిందితుడు దుబాయ్ కు పారిపోయాడు. హత్యకు సహకరించిన ఏ2 లక్ష్మణ్‌ను మూడపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అయితే, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో మర్దర్ కేసు వివరాలను భారత దౌత్యకార్యాలయంలో అందజేసి నిందితుడు మల్లేశంను దుబాయ్ నుంచి పట్టుకువస్తామని డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.