
- వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి దారుణం
- గత నెల 31న మహబూబాబాద్ జిల్లాలో ఘటన
- భార్య, ప్రియుడు అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు బోరింగ్‌తండా సమీపంలో మార్చి31న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహే తర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు నిర్ధారించారు. ఇందుకు రూ. 5 లక్షలు సుపారీగా ఇచ్చినట్లు తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం..భద్రాచలానికి చెందిన తాటి పార్థసారథి (42) దంతాలపల్లి మండల కేంద్రంలోని జ్యోతిరావుపూలే గురుకులంలో మేల్ నర్స్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుటుంబ సభ్యులు భద్రాచలంలో ఉంటుండగా పార్థసారథి ఉద్యోగరీత్యా దంతాలపల్లిలో రెంట్‌కు ఉంటూ అప్పుడప్పుడు కుటుంబసభ్యుల వద్దకు వెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో పార్థసారథి భార్య స్వప్నకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సొర్లాం వెంకటవిద్యాసాగర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం పార్థసారథికి తెలియడంతో గతంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించి, పద్ధతి మార్చుకోవాలని సూచించినా స్వప్న ప్రవర్తనలో మార్పు రాలేదు. దంతాలపల్లిలో ఉంటున్న పార్థసారథి తరచూ భార్యకు వీడియోకాల్ చేసి ఎక్కడ ఉంటున్నావని ప్రశ్నింస్తుండేవాడు. దీంతో ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి ఉండాలంటే భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ విషయాన్ని విద్యాసాగర్‌కు చెప్పడంతో ఇద్దరూ కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తెలుగూరి వినయ్‌కుమార్, శివ శంకర్, వంశీ అనే వ్యక్తులను కలిసి పార్థసారథిని హత్య చేసేందుకు ఒప్పించారు. ఇందుకు రూ. 5 లక్షలు సుపారీ ఇవ్వడమే కాకుండా, ఇన్నోవా కారును అరేంజ్ చేశారు. ఉగాది సందర్భంగా సెలవులకు భద్రాచలం వచ్చిన పార్థసారథి మార్చి 31న రాత్రి తిరిగి దంతాలపల్లికి బయలుదేరాడు.
ఈ విషయాన్ని అతడి భార్య స్వప్న తన ప్రియుడు విద్యాసాగర్‌తో పాటు మిగతా ముగ్గురికి చెప్పింది. దీంతో పార్థసారథిని వెంబడించిన నిందితులు మహబూబాబాద్ మున్సిపాలిటీ శివారులోని శనిగపురం బోరింగ్‌తండా సమీపంలోకి రాగానే పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఈ క్రమంలో మృతుడి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ పి.సర్వయ్య, ఎస్సై దీపిక పాల్గొన్నారు.